సంక్రాంతి తర్వాత మళ్ళీ నెల రోజులకు టాలీవుడ్ బాక్సాఫీస్ ఒకేరోజు నాలుగు సినిమాలతో కళకళలాడింది. అందులో ఒకటి డబ్బింగ్ కాగా మిగిలిన మూడు స్ట్రెయిట్ మూవీస్ కావడంతో ప్రేక్షకులకు మంచి ఆప్షన్లు దొరికాయి. అన్నిటి కంటే ఎక్కువగా అల్లరి నరేష్ నాంది పాజిటివ్ మార్కులు సంపాదించుకోగా మిగిలిన మూడు కూడా అటుఇటుగా డివైడ్ నుంచి నెగటివ్ టాక్ మూటగట్టుకున్నాయి. ఇందులో సుమంత్ నటించిన కపటధారి ఒకటి. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. మరి వాటికి తగ్గట్టు సినిమా మెప్పించిందో లేదో సింపుల్ రిపోర్ట్ లో చూసేద్దాం.
ఇదో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ చేసే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. గౌతమ్(సుమంత్)కు తనకు ఆసక్తి ఉన్న నేర పరిశోధనకు వ్యతిరేకంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తూ ఉంటాడు. ఓ రోజు మెట్రో నిర్మాణ తవ్వకాల్లో మూడు కపాలాలు దొరికితే వాటి వెనుక ఉన్న మిస్టరీని చేధించేందుకు పూనుకుంటాడు. దాని వెనుక భయంకరమైన విస్తుపోయే నిజాలు ఉంటాయి. వాటిని ఛేదించే క్రమంలో గౌతమ్ చాలా దూరం వెళ్తాడు. అసలు ఆ హత్యలు ఎవరు చేశారు, ఎప్పుడు జరిగాయి, ఎలా పాతిపెట్టారు, గౌతమ్ ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఎలాంటి ప్రమాదాలను ఎదురుకున్నాడు లాంటి ప్రశ్నలకు సమాధానమే కపటధారి.
లైన్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఒరిజినల్ వెర్షన్ లో జరిగిన పొరపాట్లను సవరించుకోకుండా అక్కడ సక్సెస్ అయ్యింది కదాని దాన్ని యధాతథంగా రీమేక్ చేయడం కపటధారిని దెబ్బ తీసింది. స్క్రీన్ ప్లే ఎగుడుదిగుడుగా సాగుతూ మధ్యమధ్యలో ఉన్నట్టుండి నెమ్మదించి బోర్ కొట్టించేస్తుంది. ఇలాంటి కథల్లో ఉండాల్సిన వేగం కపటధారిలో లోపించింది. అక్కడక్కడా ఆసక్తి రేపినా దాన్ని చివరి దాకా కొనసాగించడంలో ఫెయిల్ అయ్యారు. సుమంత్ తో సహా నాజర్, జయప్రకాశ్ తదితరులు తమవంతు బాధ్యత నెరవేర్చినప్పటికీ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి కనీసం డీసెంట్ అనే అవుట్ ఫుట్ కూడా ఇవ్వలేకపోయాడు. ఇలాంటి సబ్జెక్టుల మీద విపరీతమైన ఆసక్తి ఉంటే తప్ప కపటధారి సామాన్య ప్రేక్షకులను మెప్పించడం కొంత కష్టమే