iDreamPost
iDreamPost
మనది పురుషాధిక్య సమాజం. ఎంత సమానత్వం గురించి లెక్చర్లు ఇచ్చుకున్నా ఇది వాస్తవం. దీనికి సినిమాలు మినహాయింపు కాదు. ఎప్పుడో అమావాస్యకోసారి కర్తవ్యం, ప్రతిధ్వని, ప్రతిఘటన లాంటి చిత్రాలు వస్తాయి తప్ప మిగిలినవన్నీ మగాడిలో పౌరుషాన్ని గొప్పదనాన్ని కమర్షియల్ పేరుతో ఎక్కువ చేసి చూపించేవే. అధిక శాతం దర్శకులు అందుకే ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టుల వైపు అంతగా ఆసక్తి చూపించరు. ఎందుకొచ్చిన రిస్క్ అని చెప్పి సేఫ్ సైడ్ గా హీరోలను హై లైట్ చేసే కథలను రాసుకుని వాళ్ళ అభిమానులను సంతృప్తి పరిస్తే చాలనుకుంటారు. కానీ దర్శకరత్న దాసరి నారాయణరావు శైలి అది కాదు. దానికో మంచి ఉదాహరణ చూద్దాం.
1998వ సంవత్సరం. దానికి ఏడాది ముందు దాసరి ‘ఒసేయ్ రాములమ్మా’ రూపంలో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సినిమా తీసి మహిళా చైతన్యపు చిత్రాలు ఏ స్థాయిలో కనకవర్షం కురిపిస్తాయో ఋజువు చేసిన సమయం. దాని తర్వాత రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో తీసిన భారీ బడ్జెట్ మూవీ ‘రౌడీ దర్బార్’ డిజాస్టర్ కాగా కొడుకు అరుణ్ ని హీరోగా పరిచయం చేయాలని తీసిన ‘గ్రీకు వీరుడు’ కూడా బెడిసి కొట్టింది. ఆ టైంలో చాలా తక్కువ ఖర్చుతో ఆలోచింపజేసే ఒక సందేశాత్మక చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకున్నారు. అదే ‘కంటే కూతుర్నే కను’. రమ్యకృష్ణ టైటిల్ రోల్ లో తాను, జయసుధ ముఖ్య పాత్రల్లో కేవలం పాతిక రోజుల్లోనే పూర్తిచేసేలా షూటింగ్ కు సిద్ధ పడ్డారు.
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వ బాధ్యతలు దాసరి తీసుకోగా సంభాషణలు ఆయన అనంగు శిష్యుడు తోటపల్లి మధు సమకూర్చారు. కెఎస్ హరి ఛాయాగ్రహణంలో వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు అందించారు. పృథ్వి, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, ఏవిఎస్, నర్రా, ఆలీ, తనికెళ్ళ భరణి, జెవి సోమయాజులు, పిజె శర్మ తదితరులు ఇతర తారాగణం. కుటుంబంలో కూతురు గొప్పదనాన్ని చాటేలా దాసరి చూపించిన హృద్యమైన కథనం, సన్నివేశాలు మహిళలను కంటతడి పెట్టించాయి. మగరాయుళ్లను ఆలోచింపజేశాయి. ఆరోగ్యకారణాల వల్ల రెండేళ్లు తెరకు దూరంగా ఉన్న అల్లు రామలింగయ్య గారు దీంతోనే రీఎంట్రీ ఇచ్చారు. 1998 డిసెంబర్ 25న విడుదలైన కంటే కూతుర్నే కను మంచి విజయం సాధించి అయిదు విభాగాల్లో నంది అవార్డులు గెలుచుకుంది.