iDreamPost
android-app
ios-app

దేవుడు భక్తుడు డబుల్ ఫోటో – Nostalgia

  • Published Feb 02, 2021 | 11:29 AM Updated Updated Feb 02, 2021 | 11:29 AM
దేవుడు భక్తుడు డబుల్ ఫోటో – Nostalgia

మాములుగా డ్యూయల్ రోల్ సినిమాల్లో హీరో పాత్రలు అన్నదమ్ములు లేదా కవలలు అయ్యుంటాయి. లేదా ఏ వరసా లేని ఒకే పోలిక ఉన్న రెండు క్యారెక్టర్లు అయ్యుంటాయి. ఇంతకు మించి ఆలోచించడానికి ఈ లైన్ లో ఏమి ఉండదు. కానీ అలా కాకుండా దేవుడు భక్తుడు ఒకే పోలికలో సినిమా చేయడం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దానికో మంచి ఉదాహరణగా 1993లో వచ్చిన కన్నయ్య కిట్టయ్యను చెప్పుకోవచ్చు. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ ద్విపాత్రల్లో శోభన హీరోయిన్ గా హాస్య చిత్రాలతో యెనలేని గుర్తింపు తెచ్చుకున్న రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ప్రముఖ రాజకీయ నాయకులు గంగుల ప్రభాకర్ రెడ్డి దీన్ని నిర్మించారు.

కథ ఆసక్తికరంగా ఉంటుంది. పల్లెటూరిలో ఉండే యువకుడు కిట్టయ్య(రాజేంద్రప్రసాద్) విదేశాల నుంచి వచ్చిన మేనమామ బంగారయ్య(కోట శ్రీనివాసరావు)కూతురు సరోజ(శోభన)ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే తమ కుటుంబ నేపధ్యాన్ని బంగారయ్య తీవ్రంగా అవమానించడంతో తల్లి జానకమ్మ(అన్నపూర్ణ)ఆత్మహత్య చేసుకోబోతుంది. దాన్ని నివారించిన కిట్టయ్య తాము ఇంత అన్యాయానికి గురవుతున్నా నోరు మెదపడం లేదని తన ఆరాధ్య దేవుడు కృష్ణుడిని తిట్టేస్తాడు. దాంతో కిట్టయ్య దిగి వచ్చి భక్తుడికి అండగా అతని సమస్యలు పరిష్కరించి తన లోకానికి వెళ్ళిపోతాడు. ఇదీ స్టోరీ.

విలక్షణ దర్శకుడు వంశీని ప్రత్యేకంగా రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థించడంతో దీనికి ఆయన సంగీతం సమకూర్చడం విశేషం. జోకర్ తర్వాత వంశీ స్వరపరిచిన సినిమా ఇదే. దివాకర్ బాబు సంభాషణలు రాశారు. సెవెంటీ ఎంఎంలో భారీ బడ్జెట్ లోనే కన్నయ్య కిట్టయ్యని రూపొందించారు. అయితే హాస్యం తగినంత ఉన్నప్పటికీ కిట్టయ్య భూలోకానికి వచ్చాక ప్రేక్షకులు ఆశించినంత స్థాయిలో డ్రామా పండకపోవడంతో 1993 జూన్ 11న విడుదలైన సినిమా పెద్ద హిట్టు కాలేకపోయింది. అయినప్పటికీ ఇప్పుడు చూస్తే మంచి ఎంటర్ టైనర్ గా అనిపిస్తుంది. దేవుడిగా భక్తుడిగా రాజేంద్రుడి నటన కోసమైనా దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.