బీజేపీ ప్రకటించిన జాతీయ నూతన కార్యనిర్వాహక కమిటీలో మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు సముచిత స్థానం దక్కింది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో తెలుగువారికి ప్రాధాన్యమివ్వగా తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావులకు చోటు దక్కగా ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు మాత్రమే అవకాశం లభించింది.
ఏపీ బీజేపీలో చాలా మంది అగ్రనేతలు ఉన్నప్పటికీ ఆపార్టీ హైకమాండ్ మాత్రం కన్నాకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రులు ఉన్నప్పటికీ కన్నాకే చోటు దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపిక చేసిన బీజేపీ .. జాతీయ కార్యదర్శిగా అనంతపురం జిల్లాకు చెందిన సత్యకుమార్ ను నియమించింది.
2014 అక్టోబర్ లో బీజేపీ లో చేరిన కన్నా లక్ష్మీనారాయణ, ఆపార్టీలో కీలక పదవులు చేపట్టారు. కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. 2019 ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆవర్గాన్ని తమవైపు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే ఆయనకు పదవి కట్టబెట్టినట్లు ప్రచారం జరిగింది. కానీ 2019 ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. అలాగే ఆయన పోటీ చేసిన నర్సరావుపేట ఎంపీ నియోజకవర్గంలో కూడా పార్టీ పేలవ ప్రదర్శన చూపింది.
Also Read : మేనక, వరుణ్ గాంధీ లను బీజేపీ ఎందుకు దూరం పెట్టింది..?
రాష్ట్రంలో బీజేపీ పేలవ ప్రదర్శన తో కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంపై అగ్రనేతలు అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తర్వాత ఆయన స్థానంలో సోము వీర్రాజుకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర అధ్యక్షుడి పదవి పోయిన తర్వాత ఆయన రాజకీయ పరమైన పర్యటనలు తగ్గించారు. అయితే బలమైన కాపు సామాజికవర్గ నేత కావడంతో పాటు సుదీర్ఘరాజకీయ అనుభవం ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీలో మళ్లీ కీలక పదవి లభించింది. జనసేన బీజేపీకి దూరమవుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వంగవీటి రంగా సమకాలీకుడైన కన్నా లక్ష్మీనారాయణ కు ప్రాధాన్యం లభించడం ఆశక్తికరంగా మారింది.
ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నిక..
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ తరఫున ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కన్నా లక్ష్మీనారాయణ.. ఐదుగురు ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ కేబినెట్ లో రవాణా శాఖ, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
1989 నుంచి పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన కన్నా.. ఐదోసారి 2009లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో కూడా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డిపై టీడీపీ తరఫున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విజయం సాధించారు.
Also Read : బద్వేలులో టీడీపీ ఓటు బ్యాంకుపైనే బీజేపీ గురి