కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము ప్రవేశపెట్టిన మూడు రాజధానుల, వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పటి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించింది. రాజధాని ప్రకటించక ముందే తెలుగుదేశం పార్టీ నేతలు, నేతలకు సంబంధించిన సన్నిహితులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున భూములు తక్కువ రేట్లకు కొనేశారు. ఒక విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కూడా అప్పట్లోనే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపించింది.. అదేమీ లేదని దులుపేసుకున్న అప్పటి ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఎంపిక చేసింది. కానీ పూర్తిస్థాయిలో దాన్ని అభివృద్ధి అయితే చేయలేక పోయింది.
ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్ అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అయి ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అని భావించి ముందుచూపుతో మూడు రాజధానులు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా పేర్కొంటూ ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అయితే ఈ వ్యవహారం మీద తెలుగుదేశం పార్టీ ముందు నుంచి పెద్ద ఎత్తున రాద్దాంతం చేస్తూ వచ్చింది. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో అప్పటి నుంచి అమరావతి రైతుల ఉద్యమం అంటూ ఒకదానిని టిడిపి నేతృత్వంలోనే ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు సహ వైసీపీ శ్రేణులు ఎంత బహిర్గతంగా నిజాలు వెల్లడిస్తున్నా వెనక్కి తగ్గకుండా దానిని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా అప్రయత్నంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ ఒకరు అమరావతి రియల్ ఎస్టేట్ లెక్కలు బయటపెట్టారు.
టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల క్రితం మూడు రాజధానులు అని చెప్పారు కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. అలాగే రాజధానిగా అమరావతి ఉండి ఉంటే అక్కడ భూముల విలువ లక్షల కోట్లలో ఉండేదని కనకమేడల చెప్పారు. ముందు నుంచి కూడా ఇక్కడ భూముల వ్యవహారం మీద అదే చర్చ జరుగుతూ వచ్చింది.. ముందుగానే రాజధాని అక్కడ ఏర్పాటు చేయాలని భావించి తమ తమ వాళ్లకు ముందే లీక్ ఇచ్చి అక్కడ తక్కువ రేట్లకు భూములు కొని ఎక్కువ రేట్లకు అమ్ముకునేలా చేసి కోట్లకు పడగలెత్తేలా చేశారు. ఇంకా అక్కడ కొందరి పేరిట భూములు ఉండగా వాటి విలువ తగ్గకుండా ఉండటానికి రాజధాని తరలించవద్దని ప్రయత్నిస్తున్నారు తప్ప అక్కడ రైతులకు ఎలాంటి నష్టం లేదు అనేది కాదనలేని వాస్తవం. అలా అప్రయత్నంగా టీడీపీ ఎంపీ నోటివెంట ఈ రియల్ ఎస్టేట్ లెక్కలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.