iDreamPost
iDreamPost
కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం చివరి రౌండ్ వరకూ ఉత్కంఠగా సాగింది. హోరాహోరీగా పోరు నడిచింది.చివరకు కల్పలత రెడ్డి ఈ సీటు కైవసం చేసుకున్నారు. చివరి రౌండ్ వరకూ ఎవరికీ అవసరమైన మెజార్టీ దక్కలేదు. దాంతో అత్యధిక ఓట్లు సాధించిన కల్పలత విజయం సాధించారు. ఆమెకు 5953 ఓట్లు దక్కాయి. గట్టిపోటీ ఇచ్చిన పిడిఎఫ్ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు 4640 ఓట్లతో సరిపెట్టుకున్నారు. దాంతో సుమారు 1300 ఓట్ల మెజారిటీ తో కల్పలత మండలిలో అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నారు.
విద్యాశాఖలో ఉన్నత అధికారి భార్యగా కల్పలత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మొదటి ప్రయత్నంలోనే ఉపాధ్యాయుల మనసులు గెలిచారు. కీలకమైన స్థానంలో మొదటి నుంచి ఆమె ఆధిక్యంలో ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల.లెక్కింపు మొదలయిన తర్వాత కూడా ఆమె ముందంజలో కొనసాగారు. చివరకు అర్థరాత్రి దాటిన తర్వాత మూడోస్థానంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఓట్లు.లెక్కింపు తర్వాత కూడా ఆమె ఆధిక్యంకొనసాగింది. దాంతో ఆమెకే విజయం దక్కింది.
అయితే రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీట్లలో గోదావరి జిల్లాల సీటుని పీడీఎఫ్ నిలబెట్టుకుంది. వరుసగా రెండోసారి గెలిచింది. కానీ కృష్ణా గుంటూరు సీటు కోసం యూటీఎఫ్ బలంతో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండోసారి ఓటమి పాలయ్యారు. ఇక రెండు చోట్లా టీడీపీ ఘోర పరాజయం పాలయ్యింది. ఇప్పటికే పలు ఎన్నికల్లో ఓటమి బాటలో ఉన్న టీడీపీ ఉపాధ్యాయ స్థానంలో కూడా వేలు పెట్టి చేతులు.కాల్చుకుంది. సిట్టింగ్ స్థానం కృష్ణా,గుంటూరు కూడా కోల్పోయింది. రెండు స్థానాల్లోనూ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. గోదావరి జిల్లాలో అయితే టీడీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు.