కాకినాడ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం నగర పాలక సంస్థ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయముంది. ఈలోగా నగర రాజకీయాల్లో టీడీపీ నేతలు చేతులెత్తేస్తున్నారు. అధికార పార్టీ హవాకి తలొగ్గుతున్నారు. ఇప్పటికే అనేక మంది కార్పోరేటర్లు సైకిల్ దిగేశారు. మిగిలిన వారు కూడా త్వరలో అవిశ్వాస తీర్మానాల సందర్భంగా ఫ్యాన్ గాలి కోసం ఆతృతపడుతున్నట్టు కనిపిస్తోంది. దాంతో కాకినాడ నగరంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఆపార్టీ శిబిరం ఖాళీ అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
కాకినాడ నగర పాలక సంస్థకి 2017లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పాగా వేసింది. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పట్టు సాధించగలిగింది. కానీ రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత నగర రాజకీయాలు సమూలంగా మారిపోయాయి. టీడీపీ సీనియర్లు సైతం ఆపార్టీకి దూరమయ్యారు. నేరుగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శిబిరంలో చేరిపోయారు. ఈ వలసల నివారణను అడ్డుకోవడానికి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శక్తి సరిపోలేదు. అదే సమయంలో జిల్లాకు చెందిన సీనియర్లు పట్టించుకోలేదు. యనమల, చినరాజప్ప వంటి వారు తమకు పట్టనట్టే వ్యవహరించారు. ఫలితంగా ఇప్పుడు టీడీపీ క్యాంప్ పూర్తిగా వెలవెలబోయే పరిస్థితి వచ్చేస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగితే ఆపార్టీకి మరింత కష్టాలు అనివార్యంగా మారుతోంది.
Also Read : విమర్శలు చేస్తే చర్యలుంటాయని హెచ్చరించే పరిస్థితి టీడీపీకి ఎందుకు వచ్చింది..?
కాకినాడ మేయర్ పీఠంపై సుంకర పావనీ కూడా కార్పోరేటర్ల వలసలను పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. గత మేయర్ ఎన్నికల్లో తీవ్ర పోటీ కనిపించినప్పటికీ అప్పట్లో ఎంపీగా ఉన్న తోట నరసింహం సూచన మేరకు పావనికి పీఠం కట్టబెట్టారు. ఆమె భర్త సుంకర తిరుమల కుమార్ పార్టీ నగర అధ్యక్షుడి హోదాలో చేసిన కృషికి ప్రతిఫలంగా ఈ పదవి దక్కినట్టు అంతా భావించారు. ఇక ప్రస్తుతం తిరుమలకుమార్ కూడా ఏడాది కాలం కోసం మేయర్ పీఠాన్ని పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. నగరంలో వైఎస్సార్సీపీ దూకుడిని అడ్డుకోవడంలో కొండబాబు చేతులెత్తేశారని, తాము మాత్రం ఎందుకు తలపడాలని వారు ప్రశ్నిస్తున్నారు. కొండబాబుకి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారే మొదట ద్వారంపూడి దగ్గరకు చేరడాన్ని వారు చూపుతున్నారు.
ఇక వచ్చే సాధారణ ఎన్నికల నాటికి కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే సీటు కూడా కాపులకు కేటాయించే అవకాశం ఉందన్నది తిరుమలకుమార్ అంచనా. అదే జరిగితే నగరంలో టీడీపీలో పట్టున్న కాపు నేతగా తనకే అవకాశం వస్తుందని, లేదంటే తన భార్య కి మేయర్ గా అనుభవం ఉండడంతో ఆమెకు ఛాన్సిస్తారని భావిస్తున్నారు. దాంతో మత్స్యకార సామాజికవర్గానికి చెందిన కొండబాబుకి ప్రత్యామ్నాయ నేతగా తాను ఎదగాలని ఆశిస్తున్న తిరుమలకుమార్ ఈసారి మేయర్ పై అవిశ్వాసం సందర్భంగా ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని అంటున్నారు.
ఏపీలోనే టీడీపీకి ఉన్న ఏకైక మేయర్ పీఠం కోల్పోవడానికి కారణం కొండబాబు అని చెబుతూ, పార్టీ కోసం తాము పనిచేశామని అధిష్టానం వద్ద చెప్పుకోవడానికి సుంకర శిబిరం యత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ రాజకీయాల్లో ఓవైపు టీడీపీ శ్రేణులు గందరగోళంలో ఉండగా, నాయకులు సురక్షితమనుకుని వైఎస్సార్సీపీ వైపు చేరుతున్నారు. పార్టీని నడిపించాల్సిన వారు మాత్రం ఆధిప్యతపోరుతో టీడీపీని తీవ్రంగా దెబ్బతీస్తున్నారని మిగిలిన వారు వాపోవాల్సిన స్థితి దాపురించినవైనం..
Also Read : మాజీ ఎమ్మెల్యే వైఖరితోనే కాకినాడ మేయర్ అవిశ్వాసం?