తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తెలుగుదేశం పార్టీలో వర్గ విభేధాలు భగ్గుమన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ నేతల మధ్యన ఏర్పడిన కలహాలు తీవ్రంగా ముదిరి రాజీనామాల వరకు వెళ్లాయి. తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాజీ హోం మంత్రి చినరాజప్ప వ్యవహారశైలి తమని బాధించిందని చెబుతూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ శాసన సభ్యురాలు ప్రస్తుతం కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వ్యవహరిస్తున్న పిల్లి అనంత లక్ష్మి ఆమె భర్త సత్యనారాయణ మూర్తి (సత్తిబాబు) పార్టీలో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో చినరాజప్ప వ్యవహరించిన తీరు , ఆయన తమపై చేసిన వాఖ్యలు తమని తీవ్రంగా బాధించాయని పిల్లి అనంత లక్ష్మీ మీడియా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే తాము పదవులకు మాత్రమే రాజీనామా చేస్తున్నామని పార్టీకి కాదని , తాము ఇకపై ఏ ఎన్నికల్లో పోటీ చేయబోమని అయినా చివరి వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామని, తాము చనిపోయిన తర్వాత కూడా తెలుగు దేశం పార్టీ కండువా కప్పాలని కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు .
నిమ్మకాయల చినరాజప్పకు వ్యతిరేక వర్గంగా ముద్ర పడ్డ పిల్లి అనంత లక్ష్మీ దంపతులు తూర్పుగోదావరి జిల్లా సంపర నియోజకవర్గం నుండి 1999లో మొదటిసారి తెలుగుదేశం తరపున పోటీ చేసి , రెండు సార్లు అదే నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిగా గెలిచిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సత్యలింగ నాయకర్ పై విజయం సాధించారు. అయితే 2004లో వారికి తిరిగి టికెట్ లభించక నిరాశే ఎదురైంది. ఇక 2009 నియోజక వర్గాల పునర్విభజనలో సంపర నియోజకవర్గం కనుమరుగవ్వడంతో కాకినాడ రూరల్ నుంచి పిల్లి అనంత లక్ష్మీ భర్త పిల్లి సత్యనారాయణ మూర్తి బరిలోకి దిగి 3వ స్థానానికే పరిమితం అయ్యారు.
2014లో రాష్ట్ర విభజన అనంతరం కాకినాడ రూరల్ నుంచి తిరిగి శాసన సభకి ఎన్నికైన పిల్లి అనంత లక్ష్మీ వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన చెల్లబోయిన వేణు గోపాల్ కృష్ణ పై విజయం సాదించారు. అయితే నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన తాగునీటి సమస్యపై దృష్టి సారించకపోవడం , డ్రైనేజ్ సమస్యలను తీర్చకపోవడం, చేసిన చిన్నపాటి పనుల్లో లోపాలు తీవ్రంగా ఉండటం, బీచ్ ఫెస్టివల్ పేరుతో పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేయడం లాంటి పనుల మూలాన 2019 ఎన్నికల్లో అపజయాన్ని మూటకట్టుకున్నారు అనంత లక్ష్మీ.
ఇదిలా ఉంటే మొదటి నుంచి నియోజక వర్గంలో ఆధిపత్యం అంతా చినరాజప్పది అవ్వడం వీరు చినరాజప్పకు వ్యతిరేక వర్గంగా ఉండటంతో జిల్లా పరిధిలో గ్రూపు రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరాయి. మొదటి నుంచి చినరాజప్ప ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ వస్తున్న వీళ్ళకి చంద్రబాబు అండ లభించకపోగా చినరాజప్పనే జిల్లాలో ముఖ్య నేతగా గుర్తిస్తుండటంతో వీరికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ లభించలేదనే చెప్పలి.
ఇదేకాక పిల్లి అనంతలక్ష్మి కుమారుడు పిల్లి రాధా కృష్ణ గతంలో వారి స్వగ్రామం మాధవపట్నానికి చెందిన మంజు ప్రియ అనే యువతిని వివాహం చేసుకుని తిరిగి ఆమెకు తెలియకుండా తల్లి తండ్రుల ఆధ్వర్యంలో రెండో వివాహానికి సిద్ధపడగా ఈ వ్యవహారంపై మంజు ప్రియ ఫిర్యాదుతో పోలీసులు A1గా పిల్లి రాధకృష్ణ, A2గా పిల్లి సత్యనారాయణ, A3గా పిల్లి అనంతలక్ష్మీల పై కేసులు నమోదు చేయడంతో తెలుగుదేశం పార్టీ వీరిని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లో సైతం అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి వీరిని పూర్తిగా పక్కన పెట్టి చినరాజప్పకు పగ్గాలు ఇవ్వడంతో పిల్లి దంపతలు మనస్థాపానికి గురై పార్టీలో పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం.