iDreamPost
iDreamPost
కాకినాడ నగరపాలక సంస్థ నూతన మేయర్ ఎన్నిక ఈ నెల 25వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకు మేయర్‌గా వ్యవహరించిన సుంకర పావనిపై ఈ నెల 5వ తేదీన మెజార్టీ కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంలో ఆమె ‘విశ్వాసం’ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ మేరకు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ద్వారా ప్రభుత్వానికి నివేదించగా మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ కాలా భీమశంకర సుబ్రహ్మణ్యేశ్వర సత్తిబాబులను పదవుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన గెజిట్‌నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం కలెక్టర్ ఖాళీ అయిన మేయర్, డిప్యూటీ మేయర్ల పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపగా దీనిపై ఎస్‌ఈసీ నీలం సాహ్నీ పేరుతో ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది.
25 ఉదయం 11 గంటలకు ఎన్నిక…
కాకినాడ నగరపాలక సంస్థ నూతన మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఈ నెల 25న ఎన్నిక జరగనుంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ద్వారా 21వ తేదీన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులకు ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సమావేశ నోటీసులు పంపాల్సి ఉంటుంది. ఆ తరువాత 25వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ఏ కారణం వల్లనైనా ఎన్నిక జరగకపోతే ఆ తర్వాతి రోజు అంటే అక్టోబర్ 26వ తేదీన ఎన్నిక జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి ఇచ్చారు. అప్పుడు కూడా సాధ్యం కాకపోతే ఆ విషయాన్ని మళ్లీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఎస్‌ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇన్‌చార్జి మేయర్ పాలనలో..
నగర పాలక సంస్థ ఇన్‌చార్జి మేయర్‌గా ఉపమేయర్-2 వెంకట సత్యప్రసాద్ ఈ నెల 14న బాధ్యతలు స్వీకరించారు. టీడీపీకి చెందిన మేయర్ సుంకర పావనిపై అవిశ్వాసం ప్రకటించడం, దానికి పలువురు సభ్యులు మద్దతు తెలపడం తెలిసిందే. అయితే అవిశ్వాస ప్రక్రియ పూర్తయినా ఫలితం రిజర్వులో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం మేయర్ పదవి నుంచి పావనిని తొలగిస్తూ గెజిట్ జారీ చేసింది. మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్ పదవి ఖాళీ అయితే ఆ బాధ్యతలు డిప్యూటీ మేయర్ స్వీకరించాలి. దాంతో ఉపమేయర్-2గా ఉన్న సత్యప్రసాద్ 14న ఇన్‌చార్జి మేయర్‌గాబాధ్యతలు స్వీకరించారు.
22న కోర్టులో విచారణ
తనపై కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై అభ్యంతరాలు తెలియజేస్తూ మేయర్ సుంకర పావని వేసిన కేసు ఈ నెల 22వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. తనపై అవిశ్వాస తీర్మానంపై కార్పొరేటర్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి పావని హైకోర్టులో
పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి హైకోర్టులో ఇరువర్గాల వాదనలు విన్నారు. పావని న్యాయవాదులతోపాటు, ప్రభుత్వ న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం కేసును 22వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో 25న కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ఎస్‌ఈసీ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.
Also Read : Kakinada Corporation – కాకినాడ ఇన్‌చార్జి మేయర్‌గా వెంకటసత్యప్రసాద్