కాకినాడ మేయర్ సుంకర పావనిపై అక్టోబర్ 5న అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ చేవూరి హరికిరణ్ తేదీ ఖరారు చేశారు. అదే రోజు ఓటింగ్ జరుగుతుంది. పార్టీలకు అతీతంగా 33 మంది కార్పోరేటర్లు కలెక్టర్ ను కలసి మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కలెక్టరు ఈ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ మేయర్ చోడిపల్లి సత్యప్రసాద్ సారధ్యంలో కార్పొరేటర్లు శుక్రవారం కలెక్టరుతో భేటీ అవగా శనివారం ఈ ప్రకటన వెలువడింది.
ఆమె దిగిపోవడం ఇక లాంఛనమే..
మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ -1 కాలా సత్తిబాబుపై కూడా అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నట్టు కార్పొరేటర్లు చెబుతున్నారు. మేయర్ పై తీవ్ర అసంతృప్తి తో ఉన్న సొంత పార్టీకి చెందిన టీడీపీ కార్పొరేటర్లు ఆమెను పదవి నుంచి దింపేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్లపాటు అవిశ్వాసం ప్రతిపాదించరాదన్న మునిసిపల్ చట్టంలోని నిబంధన వల్ల వారు ఇన్నాళ్ళూ నిరీక్షించారు. ఈ నెల 15న మేయర్ నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి కాగా 17న కార్పొరేటర్లు అవిశ్వాస ప్రక్రియకు సిద్దం అవ్వడాన్ని బట్టే ఆమెపై ఎంత అసంతృప్తి ఉందో అర్థమవుతోంది. మెజార్టీ కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఉన్నందున పావని పదవిని కోల్పోవడం ఇక లాంఛనమే.
Also Read : బట్ట కాల్చి వేయటమే .. ఆధారాలు ఉండవు, నిరూపణ అసలే లేదు
లెక్కలివీ..
ముగ్గురు మృతి చెందడం, ఒకరు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 44 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మూడు ఎక్ష్ అఫీషీయో ఓట్లు ఉన్నాయి. దీంతో మొత్తం ఓట్లు 47 అవుతాయి. సభ కోరం పూర్తి కావాలంటే 31 మంది సభ్యులు హాజరు కావాలి. హాజరైన వారిలో సగం కన్న ఒక్క ఓటు ఎక్కువగా అవిశ్వాసానికి మద్దతుగా వస్తే మేయర్ పదవిని కొల్పోతారు.
కొత్త మేయర్ సుంకర శివ ప్రసన్న ?
అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తున్న 33 మందిలో 26 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. వీరంతా సుంకర శివ ప్రసన్న ను మేయర్ గా ఎన్నుకోవడానికి సిధ్ధపడుతున్నారు. డిప్యూటీ మేయర్ – 1గా ఎవరిని ఎన్నుకోవాలన్నది ఇంకా వారు నిర్ణయించుకోలేదు.
ఎమ్మెల్యేపై నిందలు..
ఆడలేక మద్దెల ఓడె అన్నట్టు మేయర్ పావని తన సొంత పార్టీ కార్పొరేటర్ల మెప్పు పొందలేక పదవిని కోల్పోనుండగా దీనంతటికీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కారణమని విమర్శలు చేస్తున్నారు. ఆమె అధికారాల్లో భర్త పెత్తనం పెరిగిపోవడం, పాలనలో ఒంటెద్దు పోకడలే ఈ పరిస్థితికి కారణమని ఆమె ఇప్పటికీ అంగీకరించకపోవడం విచిత్రం. పరిస్థితిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లానని, అవిశ్వాసాన్ని ఎదుర్కొంటానని అంటున్నారు.
Also Read : భవిష్యత్తు లో ఎమ్మెల్యే సీట్ అని ఆశపడి ఉన్న మేయర్ సీట్ పొగొట్టుకున్న వైనం…