నిత్యం టీవీలలో పెద్ద నోరుతో అందరి మీద విరుచుకుపడే టీడీపీ నేత పట్టాభికి షాక్ తగిలింది. కాకినాడలో మత్స్యకారులు ఆయన్ని గట్టిగా నిలదీయడంతో ఆయన కంగారుపడాల్సి వచ్చింది. టీడీపీ కార్యాలయంలో ఉన్న ఆయన్ని కాకినాడకు చెందిన బోటు యజమానులు, మత్స్యకారులు వచ్చి ముట్టడించడం కలకలం రేపింది. టీడీపీ కార్యాలయంలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లిన మత్స్యకారులు పెద్ద స్థాయిలో ఆందోళనకు పూనుకున్నారు. టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పట్టాభి ఉన్న రూమ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆపార్టీ కార్యాలయం ముందు భైఠాయించి నిరసనలకు పూనుకున్నారు.
కాకినాడలో డ్రగ్స్ దందా పేరుతో కొత్త వ్యవహారం తెరమీదకు తెచ్చిన టీడీపీ నేతలు పట్టాభిని అక్కడికి పంపించారు. అక్కడ టీడీపీ కార్యాలయంలో పట్టాభి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి మీద పలు ఆరోపణలు గుప్పించారు. డ్రగ్స్ తో ముడిపెట్టి ఘాటైన వ్యాఖ్యలు చేయడం కాకినాడలో కలకలం రేపింది. అదే సమయంలో సెప్టెంబర్ 16న జగన్నాధపురం వంతెన వద్ద జరిగిన బోటు ప్రమాదాన్ని కూడా డ్రగ్స్ తో ముడిపెట్టిన వైనం మత్స్యకారులకు ఆగ్రహాన్ని కలిగించింది. కాకినాడ కేంద్రంగా బోట్లు ఆధారంగా చేపల వేట సాగిస్తున్న తమను డ్రగ్స్ మాఫియాతో పోలీస్తారా అంటూ నిరసనకు దిగారు. టీడీపీ కార్యాలయం ముట్టడించి ఆందోళనకు పూనుకోవడం అలజడి రేపింది.
సెప్టెంబర్ 16న సాయంత్రం 6 గం.ల సమయంలో నిలిచి ఉన్న బోటు ప్రమాదానికి గురయ్యింది. దానికి కారణాలను ఇప్పటికీ ఫైర్ అధికారులు వెల్లడించలేదు. దాంతో ఆ బోటు ని ఇప్పుడు డ్రగ్స్ తో ముడిపెట్టేందుకు టీడీపీ శతవిధాలా యత్నిస్తోంది. వాస్తవానికి సెప్టెంబర్ 17న ముంద్రా పోర్టులో డ్రగ్స్ పట్టుబడిన దానికి ముందే జరిగిన ప్రమాదాన్ని పట్టుకుని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి. ఏకంగా సముద్రంలో షిప్పు కాలిపోయిందనే రీతిలో అందరినీ నమ్మించే యత్నం చేయడం విస్మకరంగా మారింది. కానీ వాస్తవాలు తెలిసిన కాకినాడ వాసులు కస్సుమన్నారు. పట్టాభి ఈ హఠాత్పరిణామంతో ఉక్కిరిబిక్కిరయినట్టు తెలుస్తోంది.
Also Read : డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ ఆరాటం ఎందుకో, ఆపార్టీ నేతల దృష్టి అటు మళ్లిందెందుకో?