iDreamPost
iDreamPost
2015 జులైలో కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ మరిచిపోలేదు. అక్రమాలు జరుగుతున్నాయని అడ్డు వెళ్లిన మహిళా అధికారిపై దాడి చేసిన ఘనులు టీడీపీ నేతలు. అంతకుముందు, ఆ తర్వాత కూడా టీడీపీ నేతలు అడ్డూ అదుపు లేకుండా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. దాడులకు దిగారు. వాళ్లతో విసిగివేసారిపోయిన ప్రజలు ఐదేళ్లకే ఇంటికి పంపారు. అయినా వాళ్లలో మార్పు రాలేదు. తీరు మారలేదు. తాజాగా టీడీపీ నేత, కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఘటనే ఇందుకు నిదర్శనం. ఆక్రమణలను కూల్చేందుకు వచ్చిన అధికారులపై బెదిరింపులకు దిగారాయన.
తిట్లు, బెదిరింపులు
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు కదిలారు. సోమవారం పట్టణంలోని కాలేజ్ సర్కిల్ నుంచి కోనేరు దాకా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సంబంధించిన మార్కింగ్ చేశారు. అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారన్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.. అక్కడికి చేరుకున్నారు. నిర్మాణాలు తొలగించకుండా అధికారులను అడ్డుకున్నారు. వారిపై తిట్ల దండకం అందుకున్నారు. అంతటితో ఆగలేదాయన. ఆఫీస్‌కు వచ్చి కొడతానంటూ బెదిరింపులకు దిగారు. ఇది కాస్తా వివాదాస్పదమైంది. అధికారులను అడ్డుకోవడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యవహారం చూసిన జనం.. రాష్ట్రమంతటా ఓట్లతో బుద్ధి చెప్పినా టీడీపీ నేతల తీరు మారలేదని చర్చించుకుంటున్నారు. వరుసగా రెండు సార్లు ఓడించినా కందికుంట దౌర్జన్యాలు ఆగలేదని మండిపడుతున్నారు.
గతంలోనూ ఇంతే..
మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దురుసుగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. 2018 జులైలో కదిరిలో ఎమ్మార్వోపై గొడవకు వెళ్లారు. బెదిరింపులకు దిగారు. నాడు కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న కందికుంట.. తన వర్గీయులకు ఇళ్ల పట్టాలిచ్చే విషయంలో కావాలనే జాప్యం చేస్తున్నారంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సమయంలో వారిని సముదాయించేందుకు ప్రయత్నించిన తహసీల్దార్ పీవీ రమణపై విరుచుకుపడ్డారు. ‘నోరు తెరిచావో.. చెయ్యి చేసుకోవాల్సి వస్తుంది’ అంటూ సీరియస్ అయ్యారు. ‘నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాపైన డెకాయిట్ కేసు నమోదైంది.. నిన్ను ఏసీబీకి పట్టించాలనుకుంటే నాకు రెండు నిమిషాలు పట్టదు’’ అంటూ బెదిరించారు. నాడు తహసీల్దార్ వివరణ ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. అందరి ముందూ తహసీల్దార్ తో బలవంతంగా క్షమాపణలు కూడా చెప్పించుకున్నారాయన.