Idream media
Idream media
లాజిక్ లేకుండా తీయడమే సినిమాలోని మ్యాజిక్ అని నమ్మిన వాడు బి.విఠలాచార్య. రూల్స్ లేకుండా గేమ్ ఆడేవాడు. హీరో మీద కోపం వస్తే ఎలుగుబంటిగా మార్చేవాడు. యువరాణులతో స్కర్టులు వేయించేవాడు.
సినిమాల్లోకి రాకముందు సినిమా టెంట్ నడిపేవాడు. జనం ఎప్పుడు నవ్వుతారో, చప్పట్లు కొడుతారో తెలుసు. నాడి తెలుసుకుని రావడంతో ఎన్నో హిట్స్ తీసాడు. 1967లో చిక్కడు దొరకడు విజయోత్సవ సభలో తన Next సినిమా కదలడు, వదలడు అని ప్రకటించాడు. టైటిల్ క్యాచీగా ఉండడంతో చెప్పాడు కానీ, ఆయన దగ్గర కథ లేదు. నిజానికి ఆయన చాలా సినిమాల్లో కథ ఉండదు. ఒకే కథని చాలాసార్లు తీసాడు. జనం తెలుసుకోలేక చప్పట్లు కొట్టారు.
1969లో వచ్చిన కదలడు వదలడు కూడా హిట్. అరిగిపోయిన కథకి ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ ప్లే సమకూర్చడం విఠలాచార్యకు తెలుసు. NTR కత్తి పడితే జనానికి కావాల్సింది నాలుగు ఫైట్స్ (అవి కూడా డూప్ చేస్తాడు. క్లోజప్ హీరోది. నేలమీద దొర్లితే డూప్) నాలుగు డ్యూయెట్స్. నలుగురు విలన్లు, ఒక వ్యాంప్ , ఇద్దరు కమెడియన్స్. (మారు వేషాల్లో NTR చేసే కామెడీ దీనికి అదనం). సినిమా హిట్. ఇదే కథని కొంచెం మార్చి కాంతారావుతో తీస్తే జనానికి గుర్తుండేది కాదు.
కదలడు వదలడులో ఒక మహారాజు, ఇద్దరు భార్యలు, ఒక దుష్టమంత్రి, కుటిల బావమర్ది, కట్టప్ప లాంటి సేనాని. పెద్దరాణిపై చిన్నరాణికి ఈర్ష్య. తన కొడుక్కి రాజ్యం దక్కాలి. ఆ రాజ్యంలో ఒక శిల్పాచారి ఉంటాడు. ఆయన మనుషుల్ని పోలిన మాస్కులు తయారు చేస్తూ వుంటాడు. ఈ టెక్నిక్‌తో పెద్దరాణి మీద రాజుకి అనుమానం పుట్టిస్తాడు. సేనాని కట్టప్ప యువరాజుని రాణిని కాపాడుతాడు.
రాజుని చంపి రాజ్యం ఏలాలనుకునే మంత్రి తదితర విలన్లు 20 ఏళ్ల పాటు ఆ పనులన్నీ వాయిదా వేసుకుంటారు. ఎలాగూ మాస్కులు ఉన్నాయి కదా, రాజుగారి మాస్కు వేసుకుని పాలించవచ్చు. హీరో పెద్దాడు అయ్యే వరకూ దర్శకుడే ఆగాడు. తల్లి మీద పడిన నిందని మాఫీ నిజం నిరూపించడానికి హీరో కోటకి వస్తాడు.
NTR , జయలలిత హీరోహీరోయిన్లు అని జనానికి తెలిసిన తర్వాత వాళ్ల మధ్య Love ఏర్పడే సీన్స్ విఠలాచార్చకి ఇష్టముండదు. తొలి చూపులోనే ప్రేమ, పాట అంతే.
తల్లి మంచితనాన్ని నిరూపిస్తానని రాజుతో శపథం చేస్తాడు. ఆ తర్వాత కథ NTR ఫార్ములాకి మారుతుంది. ఆ రోజుల్లో ప్రతి సినిమాలో NTR మారువేషం వేసేవాడు. ఈ ట్రెండ్ అడవిరాముడు, వేటగాడు వరకూ సాగింది. రాఘవేంద్రరావు కూడా దీన్నే నమ్మాడు.
మరీ విచిత్రం ఏమంటే కదలడు వదలడులో NTR తలపాగా పెట్టుకుని భటుడి వేషంలో ఉంటే తండ్రే గుర్తు పట్టలేడు. గంటసేపు సినిమా మారువేషాలతోనే లాగిస్తారు. విలన్లని చూసి ఎక్కడ జాలి కలుగుతుందంటే ప్రతిరోజూ చూసే జయలలిత హెయిర్‌స్టైల్ మార్చి చైనా భాష మాట్లాడితే గుర్తు పట్టలేరు.
నిర్మాతలతో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టించడం విఠలాచార్యకి ఇష్టం ఉండేది కాదు. ఒక సెట్‌ని రకరకాలుగా మార్చి తీసేవాడు. చెలికత్తె వేషంలో ఝాన్సీ రెండు సీన్స్‌లో కనిపించి మళ్లీ కనపడదు. షూటింగ్‌కి లేట్‌గా వచ్చిందని మార్చేసి వేరే అమ్మాయిని పెట్టాడు.
క్లైమాక్స్‌లో ముళ్ల చక్రాలు, అగ్నిజ్వాలలు, కత్తుల వంతెన ఇలాంటివి సృష్టించడం విఠలాచార్య అలవాటు. గ్రాఫిక్స్ లేకుండా , ట్రెక్ ఫొటోగ్రఫీతో టైం వేస్ట్ చేయకుండా ఆర్ట్ డైరెక్టర్ సాయంతో ఇవన్నీ చేసేవాడు. కేవలం Manualగా ఇదంతా ఎలా సాధ్యమైందా అని ఇప్పటికీ ఆశ్చర్యపోతాం.
ఈ సినిమా షూటింగ్‌లో వేషం కోసం ఒకావిడ తన కూతురిని తీసుకుని ఆటోలో స్టూడియోకి వచ్చింది. ఖాళీల్లేవని విఠలాచార్య చెప్పాడు. ఆవిడ నిరాశగా వెళ్లిపోయింది. ఆమె పేరు పుష్పవల్లి, కూతురి పేరు రేఖ. ఆ అమ్మాయి తర్వాత బాలీవుడ్ స్టార్‌గా మారింది.
ఇంతకీ కదలడు వదలడు ఎవరంటే విలన్లని బెదిరించడానికి NTR ఆ పేరుతో ఉత్తరాలు రాస్తుంటాడు. అంతే!