iDreamPost
android-app
ios-app

తెలుగుతెరపై విశ్వనాథ సంతకం – Nostalgia

  • Published Feb 19, 2020 | 7:35 AM Updated Updated Feb 19, 2020 | 7:35 AM
తెలుగుతెరపై విశ్వనాథ సంతకం – Nostalgia

ఇప్పటిదాకా కొన్ని వేల సినిమాలను వెండితెరపై లిఖించిన దర్శక దిగ్గజాలలో కళాతపస్వి కె విశ్వనాధ్ గారిది విలక్షణ శైలి. సాంప్రదాయక కమర్షియల్ సూత్రాలకు భిన్నంగా కళ, సంప్రదాయం. కుటుంబ విలువలు, సంగీతం, మంచితనం, మానవత్వం తదితర అంశాలతో కథలు రాసుకుని అంతే హృద్యంగా తెరకెక్కించడంలో ఆయన శైలినే వేరు.

1965లో ఆత్మ గౌరవం సినిమాకు డెబ్యూతోనే నంది అవార్డు అందుకున్న విశ్వనాధ్ ఆ తరువాత ఉండమ్మా బొట్టు పెడతా, నిండు హృదయాలు, చెల్లెలి కాపురం, కాలం మారింది, నేరము శిక్ష, శారద, జీవన జ్యోతి, సీతామాలక్ష్మి, ప్రెసిడెంట్ పేరమ్మ, సిరిసిరిమువ్వ లాంటి వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సృష్టించుకున్నారు.

1979లో వచ్చిన శంకరాభరణం విశ్వనాధ్ గారిలోని కొత్త సృజనకారుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటిదాకా కుటుంబ కథా చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన విశ్వనాధ్ గారు ఇందులో సంగీతాన్ని ప్రధానాంశంగా తీసుకుని ముసలివాడిని హీరోగా పెట్టి చేసిన సాహసం పండితులనే కాదు పామరులను సైతం అనన్య సామాన్య రీతిలో మెప్పించిందిఅప్పటి నుంచి తన సినిమాల్లో సంగీతానికి పెద్ద పీఠ వేస్తూ వచ్చారు విశ్వనాధ్ గారు.

శ్రుతిలయలు, సాగర సంగమం, సప్తపది, శుభోదయం,స్వాతి ముత్యం, జననీ జన్మభూమి, స్వాతి కిరణం, శుభసంకల్పం లాంటి ఎన్నో ఆణిముత్యాలు విశ్వనాధ్ గారి ప్రతిభను ఉన్నతస్థాయిలో నిలబెట్టాయి. చిరంజీవి లాంటి మాస్ హీరోతోనూ శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి కళాఖండాలతో నీరాజనాలు అందుకోవడం ఆయనకే చెల్లింది. దర్శకుడిగానే కాక నటుడిగా సైతం కలిసుందాంరా, సంతోషం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో తన పాత్రలకు నటన ద్వారా ప్రాణప్రతిష్ట చేశారు. రాయడం మొదలుపెడితే విశ్వనాథ్ గారి గురించి పుస్తకాలు సరిపడనంత సాహిత్య సాగరం ఉంది. ఆ మహానుభావుడి జన్మదినం సందర్భంగా తెలుగు సినిమాకు ఆయన చేసిన విశిష్ట సేవ గురించి చెప్పుకోవడం కన్నా గొప్ప కానుక ఏముంటుంది.