iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ కన్నెగంటి లలితను బదిలీ చేశారు. ఆమెను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించడంతో ట్రాన్సఫర్ తప్పనిసరిగా మారింది. గత ఏడాది మే నెలలో ఆమె ఏపీ హైకోర్టు జడ్జీగా బాధ్యతలు స్వీకరించారు. ఏడాదిన్నర తిరగకుండానే ఆమెను బదిలీ చేయడం ఆసక్తిగా మారింది.
గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని చెరువు జమ్ములపాలెంలో లలిత జన్మించారు. ఆమె విద్యాభ్యాసం హైదరాబాద్ లో సాగింది. 1994 నుంచి ఆమె న్యాయవాద వృత్తిలో ఉన్నారు. టీటీడీ సహా వివిధ సంస్థలకు ఆమె లీగల్ అడ్వైజర్ గా పనిచేశారు.
ఏపీ హైకోర్టు జడ్జిగా ఆమె కీలక కేసుల విచారణలో భాగస్వాములయ్యారు. పలు తీర్పులిచ్చారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కేసును ఏపీ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించగా జస్టిస్ లలిత తీర్పునిచ్చారు. బెయిల్ ఆర్డర్ల విషయంలోనూ, కోవిడ్ సమయంలో వలసకూలీల సమస్యలకు సంబంధించిన కేసుల్లోనూ ఆమె విచారణ జరిపారు.
ప్రస్తుతం ఆమె తెలంగాణ హైకోర్టుకి బదిలీ కావడం వెనుక కారణాలపై పలు చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో వేసిన పిటీషన్ ని ఇటీవల నాంపల్లి ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దాంతో ఈ కేసు విచారణ కోసం కనుమూరి రఘురామరాజు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. త్వరలో ఈ కేసు తెలంగాణ హైకోర్టు ముందు విచారణకు రాబోతోంది.
దాంతో జస్టిస్ కన్నెగంటి లలిత బదిలీ ఆసక్తి రేపుతోంది. జగన్ కేసు విచారణ ఎవరు స్వీకరిస్తారు, ఎలా సాగుతుందన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. కానీ ఈ వ్యవహారం మాత్రం ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులకు ఆస్కారమిస్తుందనడంలో సందేహం లేదు. దాంతో జస్టిస్ లలితను అనూహ్యంగా ఏపీ నుంచి తెలంగాణకి బదిలీ చేయడం చర్చకు దారితీస్తోంది. ఇటీవల పలువురు జడ్జీల నియామకం జరిగింది. కానీ ఈనెల 16న జరిగిన సమావేశంలో కొలీజియం జస్టిస్ లలిత బదిలీ కి ప్రతిపాదించిన విషయం న్యాయవర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.
Also Read : AP Police Department Weekly Off -పోలీసులకు వీక్లీ ఆఫ్ : దేశంలో మొట్టమొదటిసారి ఏపీలోనే..