iDreamPost
iDreamPost
“ఏదో భయంగా ఉంది మామా. ఫస్ట్ డే టికెట్ కౌంటర్ ఇంత ఫ్రీగా ఉందేంట్రా”
ఇంటి నుంచి బయలుదేరినప్పుడు మొదలైన నా అనుమానం థియేటర్ దగ్గర పరిస్థితి చూసేసరికి విశ్వరూపం ఎత్తుకుంది.
ఆదోని అనే చిన్న పట్టణంలో సత్యం కాంప్లెక్స్. మల్టీ ప్లెక్స్ లు తెలియని రోజుల్లోనే నాలుగు స్క్రీన్లతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. అందులో వేశారు జానీ. ఇంద్ర, ఖుషిలు సిల్వర్ జూబ్లీలు ఆడించిన చరిత్ర దానిది.
మావాడు ఏ మాత్రం తగ్గలేదు
“నీ బొంద. అందరూ లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. సెకండ్ షో టికెట్లు కూడా అవగొట్టేసి ఇంకేం చేయలేక ఆ అమ్మేవాడు డబ్బులు లెక్కబెట్టుకుంటున్నాడు. నీ పాడు డౌట్లు నువ్వూనూ. మనం ముందే చెప్పేశాం కాబట్టి తీసి పెట్టారు”
వాడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే భలే ముచ్చటేసింది. సరే అని నేను పక్కకు నిలబడ్డా.
మాములుగా మెగా బ్రదర్స్ మూవీ అంటే బెనిఫిట్ షో పడాల్సిందే. అందులోనూ ఖుషి తర్వాత వస్తున్న సినిమా పైగా పవన్ కళ్యాణ్ సెల్ఫ్ డైరెక్షన్. ఉదయం నుంచి కాళ్ళు కుదురుగా ఉండటం లేదు. అప్పుడు మా ఫ్రెండ్స్ బ్యాచ్ డెడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కాని నాన్న కొత్తగా పెట్టిన షాపు కాబట్టి ఉదయం పూట నేను ఖచ్చితంగా ఉండాల్సి వచ్చేది. అందుకే ఈవెనింగ్ షో తప్ప వేరే ఆప్షన్ లేకపోయింది. టాక్ అప్పటికే వచ్చేసింది. ఆ కామెంట్లు వినలేక చెవుల్లో దూది పెట్టుకోవాలనిపించేది కానీ మాది ఫర్టిలైజర్స్ దుకాణం కాబట్టి ఆ అదృష్టమూ లేదు.
ఇలా నా ఆలోచనలో నేనుండగా మావాడు టికెట్ ముక్కలు తేవడం ఇద్దరం చకచకా లోపలికి వెళ్ళడం జరిగాయి. టైటిల్స్ పడ్డాయి. ఆడియో పోస్టర్ లో చూసినప్పటి నుంచే నాకు పవన్ కళ్యాణ్ అవతారం నచ్చలేదు. మీసం లేకుండా బక్కపలచని దేహంతో అసలు ఇతగాడు ఖుషిలో హీరోనా లేక అదే పోలికలున్న డమ్మీని పెట్టి తీశారా అనే అనుమానం వచ్చేది. ఈలలు కేకలు లేవు. ఏదో సంతాప సభలో కూర్చునట్టు హాలు మొత్తం చాలా నిశబ్దంగా ఉంది. ఒకటి రెండు పాటలు వచ్చినప్పుడు తప్ప ఇంకే గోలా లేదు.
ఇంటర్వల్ వచ్చింది. చిట్టి సమోసాలు తింటున్నామన్న మాటే కాని మాకు అప్పటిదాకా చూసింది సినిమానో సీరియలో అర్థం కాలా. ప్రొజెక్టర్ రూమ్ లోకి వెళ్లి రీలేమైనా పొరపాటుగా మారిందేమోనని అడుగుదామనుకున్నాం. కాని ఆడియో క్యాసెట్లో విన్న పాటలు స్క్రీన్ మీద ప్రూఫ్స్ గా కనిపించాయి కాబట్టి ఆ పిచ్చి ఆలోచన మానుకున్నాం.
సరే సరే ఎన్నో అనుకుంటాం ఇంకా సెకండ్ హాఫ్ ఉందికదాని లోపలికి వెళ్లిపోయాం. కథలో హీరొయిన్ కి క్యాన్సర్ అన్నారు కాని నిజానికి పవనే జబ్బు వచ్చిన వాడిలా ఉన్నాడు. అప్పుడు చేతుల్లో సెల్ ఫోన్లు లేవు. మూసుకుని తెరవైపు చూడాల్సిందే. అయిపోయింది. శుభం కార్డు పడింది.
టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, కెమెరా యాంగిల్స్ బాగా సెట్ చేశారు, సింక్ సౌండ్ తీసుకొచ్చారు, ఫైట్స్ కష్టపడి కంపోజ్ చేశారు ఇవన్ని నాలాంటి వాడికి అనవసరం. నాకంటూ కొన్ని లెక్కలుంటాయి. బద్రి నుంచి ఖుషి దాకా అవి నెరవేరాయి కాబట్టి ఒకటి ఐదుసార్లు చూసిన ట్రాక్ రికార్డు ఉంది. కాని జానీ కేసు వేరు. అందుకే ఫలితమూ వేరు. ఇవాళ మిత్రులు కొందరు దీనికి 18 ఇయర్స్ ఫర్ జానీ అంటూ ఏదో సెలబ్రేషన్ చేస్తుంటే ఇలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సి వచ్చింది