టెలికం సేవల సంస్థ జియో భారీ ప్రణాళికను వెల్లడించింది. దేశీయంగా 5జీ సేవలకు సంబంధించిన సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. కాగా, వచ్చే ఏడాదే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు భారత అవసరాలకు అనుగుణంగా చౌక ఆండ్రాయిడ్ 5జీ స్మార్ట్‌ఫోన్లను దేశీ సాంకేతికతతో రూపొందించనుంది. దీనికోసం టెక్ దిగ్గజం గూగుల్‌తో జత కట్టింది.
జియోలో గూగుల్ పెట్టుబడులు
జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ దాదాపు రూ. 34 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. బుధవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ మేరకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5జీ స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే మేడిన్ ఇండియా 5జీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించవచ్చని, మరుసటి ఏడాది క్షేత్రస్థాయిలో ఉపయోగంలోకి తేవచ్చన్నారు. ‘5జీ సొల్యూషన్‌ను ప్రారంభ స్థాయి నుంచి పూర్తిగా జియోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేసిందని చెప్పేందుకు గర్వంగా ఉంది. 100 శాతం దేశీ సాంకేతికత, సొల్యూషన్స్‌ను ఉపయోగించి ప్రపంచ స్థాయి 5జీ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఇది తోడ్పడుతుంది‘ అని ముకేశ్ పేర్కొన్నారు. ‘ఆండ్రాయిడ్ ద్వారా అందరికీ కంప్యూటింగ్ సామర్థ్యాలను అందుబాటులోకి తేవాలన్నది మా లక్ష్యం. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లో కార్యకలాపాలను విస్తరించేందుకు ఇది సరైన సమయం. జియోతో భాగస్వామ్యం ఆ దిశగా తొలి అడుగు‘ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
2జీకి విముక్తి…
5జీ సేవల ముంగిట్లో ఉన్న భారత్‌ను 2జీ నుంచి విముక్తి చేసేందుకు కృషిచేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం 2జీ ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్న దాదాపు 35 కోట్ల మంది భారతీయులను చౌక స్మార్ట్‌ఫోన్ల వైపు మళ్లేలా చేయాలని అంబానీ అభిప్రాయపడ్డారు. ఎంట్రీ లెవెల్ 4జీతోపాటు 5జీ స్మార్ట్‌ఫోన్లనూ ప్రస్తుత ధర కంటే ∙చౌకగా డిజైన్ చేయగలమన్న నమ్మకం ఉందన్నారు. అయితే, దీనికోసం భారత్ అవసరాలకు అనుగుణంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టం అవసరమన్నారు. టెక్ దిగ్గజం గూగుల్‌తో భాగస్వామ్యం ద్వారా ఇది సాధ్యమౌతుందన్నారు. భారత్ స్థాయిలో 5జీ సొల్యూషన్స్ ఉపయోగం నిరూపితమైన తర్వాత వీటిని అంతర్జాతీయంగా ఇతర టెల్కోలకు ఎగుమతి చేస్తామని వెల్లడించారు.