iDreamPost
android-app
ios-app

అమ్మాయిలను మోసం చేసే ‘వి’ – Nostalgia

  • Published Dec 08, 2020 | 12:20 PM Updated Updated Dec 08, 2020 | 12:20 PM
అమ్మాయిలను మోసం చేసే ‘వి’ – Nostalgia

అదేంటి వి అంటే నాని కదా అని ఆశ్చర్యపోకండి. ఇరవై రెండేళ్ల క్రితమే వి క్యారెక్టర్ తో ఓ సినిమా వచ్చింది. అది కూడా నెగటివ్ షేడ్స్ లోనే సాగుతూ నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేసిందంటే షాక్ అనిపించవచ్చు. సుప్రసిద్ధ సినీ రచయిత సత్యానంద్ 1988లో స్వీయ రచనలో దర్శకత్వం వహించిన చిత్రం ‘ఝాన్సీ రాణి’. మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘మిస్టర్ వి’ అనే నవల అప్పట్లో యావత్ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పెళ్లి కాని అమ్మాయిలను ఒకరికి తెలియకుండా మరొకరిని మారుపేర్ల(ప్రతి పేరు మొదటి అక్షరం ‘వి’తోనే ఉంటుంది)తో గుట్టుగా పెళ్ళిళ్ళు చేసుకునే ఓ మోసగాడి ఇతివృత్తమే వి. బోలెడు మలుపులు థ్రిల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ సీరియల్ కి రీడర్స్ కి ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది.

ఈ కథనే సినిమా తీయాలన్న ఆలోచనతో మిద్దె రామారావు నిర్మాతగా సత్యానంద్ మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. నవల స్టైల్ లో కాకుండా సబ్జెక్టుని హీరోయిన్ యాంగిల్ లో మార్చుకుని ఝాన్సీ రాణి టైటిల్ తో భానుప్రియను మెయిన్ రోల్ లో, రాజేంద్రప్రసాద్ ని మోసగాడి పాత్రలో ఎంచుకున్నారు. చక్రవర్తి సంగీతం అందించగా డిడి ప్రసాద్ ఛాయాగ్రహణం సమకూర్చారు. గత ఏడాది వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ తమ్ముడిగా నటించిన దగ్గుబాటి రాజా ఇందులో భానుప్రియ లవర్ గా చేయగా కోట శ్రీనివాసరావు సిబిఐ ఆఫీసర్ గా కనిపిస్తారు. జగ్గయ్య, కాంతారావు, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర తారాగణం.

దివ్యంగురాలైన అక్కయ్యను పెళ్లి చేసుకుని మోసం చేసి పారిపోయిన వి అనే ఆగంతకుడి కోసం ప్రియుడి సహాయంతో వేట మొదలుపెడుతుంది ఝాన్సీ రాణి. అయితే ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు బయటపడతాయి. సింపుల్ గా ఇదే స్టోరీ. అయితే సుదీర్ఘమైన నవలను సినిమా కోసం కుదించి హీరోయిన్ యాంగిల్ లో చెప్పడం ప్రేక్షకులకు రుచించలేదు. అప్పటికే హీరో ఇమేజ్ వచ్చిన రాజేంద్రుడిని ఇలాంటి క్యారెక్టర్ లో రిసీవ్ చేసుకోలేకపోయారు. ఫలితంగా ఝాన్సీ రాణికి బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పలేదు. అయినా కూడా డిఫరెంట్ స్టోరీ లైన్ తో రూపొందిన ఝాన్సీ రాణి ఇప్పటి ట్రెండ్ లో చూసుకుంటే ఖచ్చితంగా ఒక విభిన్న ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.