iDreamPost
android-app
ios-app

మా వాళ్ళు రక్తం తాగుతారంటున్న “జేసీ”

  • Published Oct 10, 2020 | 12:28 PM Updated Updated Oct 10, 2020 | 12:28 PM
మా వాళ్ళు రక్తం తాగుతారంటున్న “జేసీ”

వివాదాస్పద నేతగా ముద్రపడ్డ తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డి మరో సారి వార్తల్లో వ్యక్తిగా మారారు.. ఏదో ఒక అధికారిపై తన మాటలతో దూకుడుగా, దురుసుగా ప్రవర్తించే ఆయన ఈ సారి మైన్స్ అధికారులపై అలాగే పోలీసు అధికారులపై బెదిరింపు ధోరణికి దిగారు. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల ముచ్చు కోట కనుమల పరిధిలోని అటవీ ప్రాంతంలో జేసీ దివాకర్‌రెడ్డి సతీమణి విజయమ్మ , సోదరి పేర్లపైన ఉన్న సున్నపురాయి గనుల క్వారీలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

అయితే తన వారికి సంబంధించిన గనులపై అధికారులు తనీఖీలు నిర్వహించడాన్ని సహించని జేసీ అనంతపురం, తాడిపత్రి రోడ్డు సమీపంలో ఉన్న మైన్స్ కార్యాలయం వద్ద ప్రభుత్వం పై నిందారోపణ చేస్తూ హల్చల్ చేశారు. ఈ సమయంలో ఆయన అక్కడ ఉన్న అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ “మా అనుచరులు రాక్షసులు, పచ్చి రక్తం తాగేవాళ్లు నా చుట్టూ ఉన్నారు. వాళ్లు మీ రక్తాన్ని పులి, సింహాల్లాగా తాగుతారు.’’ప్రస్తుతం మమ్మల్ని అధికారులు సన్మానిస్తే, మేము అధికారంలోకి వచ్చాక వారిని రెట్టింపు స్థాయిలో సన్మానిస్తాం అంటూ బెదిరింపు వాఖ్యలు చేశారు.

ఇటీవలే తన సోదరుడైన జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సుల స్కాంలో రిమాండ్ లో ఉండటం, అలాగే తన మైన్స్ కి సంబంధించిన కేసుల్లో కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడటంతో తాను సచ్చీలుడనని రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు, జేసీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ దూషణలకు దిగుతున్నారని, నిజానికి అధికారంలో ఉన్నన్ని రోజులు వారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేయని దందా లేదని బస్సుల కుంభకోణం దానికి ఒక మచ్చు తునక అని ఆయన అధికారులపట్ల వ్యవహారిస్తున్న తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి వారు చెబుతున్న మాట..