Idream media
Idream media
ఎక్కడ చూసినా పోలీసులు… ఎటు చూసినా సీసీ కెమెరాలు.. నలుగురికి మించి కలిసి తిరగకూడదు.. గ్రామాల నుంచి ఎవరూ ఇక్కడకు రాకూడదు.. కనుచూపు మేర నిర్మానుష్యం.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రస్తుత పరిస్థితి. అంత వరకూ ప్రశాంతంగా ఉండే తాడిపత్రిలో ఈ అలజడికి కారణాలేంటి..? అంత తీవ్ర స్థాయిలో గొడవలు జరిగినా.. ఇదంతా వైసీపీ ఎమ్మెల్యే పనేనన్న జేసీ.. ప్రత్యర్థి వర్గంపై ఎందుకు కేసులు పెట్టలేదు..? భయపడ్డారా..? లేదా మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా తాడిపత్రిలో ఇప్పటికీ 144 సెక్షన్ కొనసాగుతోంది. ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించాయి. తాడిపత్రి పట్టణం, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా పోలీసుల ద్వారా నిఘా ఉంచారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం నివురుగప్పిన నిప్పులా ఉంది. టీడీపీకి చెందిన జేసీ సోదరుల వర్గీయుల రెచ్చగొట్టే పోస్టింగ్ లే ఈ దుస్థితికి తెచ్చాయి. ఎలాగైనా ఎమ్మెల్యేను రెచ్చగొట్టి ప్రజలలో భయాందోళనలు సృష్టించాలని జేసీ వర్గాలు భావిస్తున్నాయని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రజలను, గ్రామాల్లోని నాయకులను రెచ్చగొట్టి, గొడవలను సృష్టించి పబ్బం గడుపుకునే నీచ చరిత్ర జేసీ సోదరులదేనని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటున్నారు. సోషల్ మీడియాలో వారి పోస్టింగులు మితిమీరిపోతుండటంతో.. వారితో చర్చించి వారి ఇబ్బంది తెలుసుకోవడం కోసమే గురువారం తాను జేసీ సోదరుల ఇంటికి వెళ్లానన్నారు. ఆ సమయంలో వారెవరూ ఇంట్లో లేకపోవడంతో తిరిగి వచ్చేశానన్నారు. మాట్లాడటానికి వెళ్తే దాడిచేయడానికి వచ్చానని తిరిగి మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇలా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చే పరిస్థితికి జేసీ వర్గీయులే కారణమని తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే జేసీ వర్గీయుల ఆరోపణలు మరోలా ఉన్నాయి. ఎమ్మెల్యే, వారి అనుచరులే తమ ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించారని చెబుతున్నారు. అదే నిజమైతే ఎందుకు ఎమ్మెల్యే వర్గీయులపై కేసులు పెట్టలేదనేది ప్రశ్నర్థాకంగా మారింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేయలేదు. పెద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలపై ఆరోపణలకే పరిమితమైంది జేసీ వర్గం. ఇక జేసీ వర్గీయుల దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మనోజ్, బ్రహ్మేంద్ర జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మనోజ్, బ్రహ్మేంద్ర ఫిర్యాదు చేయడంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.ఐపీసీ 307,306 సెక్షన్ల కింద జేసీ వర్గానికి చెందిన 27 మందిపై పోలీసులు కేసులు బుక్ చేశారు. దీంతోపాటు గొడవలకు కారణమైన యూట్యూబ్ ఛానల్ విలేకరి వలిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.