అనువు గాని చోట అధికులమనరాదు అన్నది పెద్దల సామెత. దీనిని కాస్త ఆలస్యంగా వంట పట్టించుకున్నారు అనంతపురం జిల్లా జేసీ సోదరులు. నిన్న మొన్నటి వరకూ జిల్లా రాజకీయాలన్నీ తమవే అని చెప్పుకున్న వీరు ప్రస్తుతం క్షేత్ర స్థాయి పరిస్థితికి అనుగుణంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. రాజకీయాల్లో సైతం వారి ఆలోచనల్లో మార్పుసూచిస్తోంది. మొన్నటి ఎన్నికల వరకు తాడిపత్రి ఎమ్మెల్యే గా పనిచేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా తాడిపత్రి మున్సిపాలిటీ జరిగే ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇది అనంతపురం రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
వ్యూహత్మాకమా లేక పశ్చాత్తాపమా?
అనంతపురం రాజకీయాల్లో జెసి బ్రదర్స్ ది ప్రత్యేక శైలి. దివాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉంటే, ప్రభాకర్ రెడ్డి స్థానిక రాజకీయాల్లో తమ హవా చూపించేవారు. ఒక వ్యూహం ప్రకారం రాష్ట్ర స్థాయిలోనూ , స్థానికంగా ను తమ ఆధిపత్యం పోకుండా జాగ్రత్త పడేవారు . అందుకే ఎప్పుడూ దివాకర్రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీలో ఉంటే, దివాకర్ రెడ్డి మాత్రం స్థానికంగా తాడిపత్రి మున్సిపాలిటీ మీద ఎక్కువగా దృష్టి పెట్టేవారు. 1987లోనే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన జేసీ ప్రభాకర్ రెడ్డి 2000లో మరోసారి ఆ సీట్లో కూర్చున్నారు. 2005లో ఒకమారు రిజర్వేషన్లు బీసీ వర్గానికి రావడంతో తమ అనుచరున్ని చైర్ పర్సన్ గా చేసి, వైస్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉండి వెనుక ఉండి చక్రం తిప్పే వారు.
మొదటి నుంచి కాంగ్రెస్ వాదులు గా ఉన్న జెసి సోదరులు 2014లో టీడీపీ లో చేరి జెసి దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలిస్తే, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హయాంలో అనంతపురం జిల్లా రాజకీయాలు అంతా తామే అన్నట్లుగా వ్యవహరించి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రచారం కోసం ఆరాట పడేవారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, జెసి సోదరులు ఇద్దరూ పోటీలో లేకుండా తమ కుమారులతో రాజకీయ అరంగేట్రం చేయించారు. అయినప్పటికీ జనం నమ్మకాన్ని కోల్పోయి ఓటమి చవి చూసారు.
భిన్న వాదనలు
జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నట్టుండి తాడిపత్రి మున్సిపాలిటీ సభ్యుడిగా పోటీ చేస్తానని , తనకు పదవులు ఏవి అక్కర్లేదని చెప్పడం మీద రెండు రకాల వాదనలు ఇస్తున్నాయి. అనూహ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తెరపైకి వచ్చి తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేస్తానంటూ పాత పాట అందుకోవడం వ్యూహాత్మక ఎత్తుగడగా కొందరు చెబుతుంటే, ఏమీ చేయలేని నిరుత్సాహం, తగ్గుతున్న ప్రజాదరణ చూసి పశ్చాత్తాపం తోనే ఒక వార్డుకు పరిమితం కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి భావిస్తున్నారు అన్నది ఒక వాదన. స్థానికంగా తమ పట్టు పెంచుకోవాలంటే తాడిపత్రి మున్సిపాలిటీ వేదిక అవుతుందని భావిస్తున్నారు.
ప్రజల వద్దకు వెళ్లే ఆలోచన
గతంలోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలో తాడిపత్రి మున్సిపాలిటీ స్వచ్ఛత, పచ్చదనం విషయంలో రాష్ట్రస్థాయి దృష్టిని ఆకర్షించింది. బహిరంగంగా చెత్త వేసే వారి వద్దకు చైర్మన్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లి వారిని గట్టిగా మందలించిన దృశ్యాలు అలాగే చెట్ల పెంపకం విషయంలో నిక్కచ్చిగా సవరించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. ఇక తాడిపత్రి మున్సిపాలిటీ భవనాన్ని అత్యాధునికంగా నిర్మించడంలో జేసీ ప్రభాకర్రెడ్డి చొరవ ఎంతో ఉంది. దీంతో ఇప్పుడు మళ్లీ తాడిపత్రిలో పుంజు కోవాలంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ వేదికగా తమ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచన జెసి సోదరులు కనిపించినట్లు తెలుస్తోంది. మరోపక్క తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు సైతం ఈ సారి తాడిపత్రి వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న సమయంలో మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిల్ లోకి వస్తే ఏం జరుగుతుందోనన్న భయం మిగిలిన నేతల్లో కనిపిస్తుంది.