అనంతపురం జిల్లా సీనియర్ నేత, మాజీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా బలపడేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం అన్ని మార్గాలనూ పరిశీలిస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్ బీజేపీలో చేరి ఆపార్టీ పటిష్టతకు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు సైతం ఏపీపై దృష్టి సారిస్తున్నారు. ఈ అంశాలపై మాట్లాడేందుకు ఆపార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సుజనాచౌదరి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంలొ సుజనా నివవాసంలో జేసీ దివాకర్‌రెడ్డి జేపీ నడ్డాను కలిసారు. సుజనా దివాకర్‌రెడ్డిని జేపీ నడ్డాకి పరిచయం చేస్తూ ఆయన రాజకీయ అనుభవాన్ని వివరించారు. ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు. ఏపీలో భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో జగన్ పై ప్రజల్లో ఎన్నో ఆశలున్నాయని, ప్రజల ఆశలకు తగ్గట్టుగా జగన్ పాలన జరగక పెద్దఎత్తున అసంతృప్తి రాజుకుంటుందని, ప్రస్తుతం రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఉందని జేసీ జేపీకి వివరించారట.. జగన్ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలు, న్యాయపరమైన చిక్కులు వంటి పలు కీలకాంశాలను దివాకర్‌రెడ్డి ప్రస్తావించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అనంతపురంలో తన ట్రావెల్స్‌పై అన్యాయంగా దాడులు చేస్తోందని, బీజేపీ, టీడీపీ కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలు చేస్తోందని జేసీ చెప్పారట. వీరిద్దరి భేటీ ముగిసిన తర్వాత కూడా సుజనా జేపీ సమావేశమయ్యారు. వీరిమధ్య ఏపీలో బీజేపీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహంపై కూలంకశంగా చర్చ జరిగింది.
ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు రోడ్‌మ్యాప్ తయారు చేసుకోవాలని సూచించడంతో పాటే టీడీపీతోపాటు ఇతరపక్షాల నుంచి బీజేపీలోకి వచ్చే నేతల వివరాలను సుజనా నడ్డాకి తెలియజేశారట. జేసీ దివాకర్ రెడ్డి కూడా బీజేపీలో సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని కూడా నడ్డాకు సుజనా వివరించారట. అలాగే జేసీ చెప్పిన కొన్ని అంశాలపై నడ్డా తన అభిప్రాయాలు వెల్లడించారట. డిసెంబర్ 8వ తేదీన నడ్డా విజయవాడకు వచ్చి బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈసమయంలో కొందరు నేతలను పార్టీలో చేర్చుకునే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీని బలమైన శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేగంగా రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత, రాజధాని నిర్మాణాల నిలిపివేత, పోలవరం రివర్స్ టెండరింగ్, గ్రామ వాలంటీర్ల నియామకాలు వంటి నిర్ణయాలను బీజేపీ వ్యతిరేకించింది. ప్రస్తుతం ఇరుపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్న నేపధ్యంలో ఇతరపార్టీలనుంచి కొందరిని తీసుకుని అగ్రెసివ్ గా ప్రభుత్వంపై పోరాడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పోషించబోయే పాత్ర గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది.