Idream media
Idream media
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం రాజకీయ వైవిధ్యానికి పెట్టింది పేరు. అక్కడ జరిగినన్ని వివాదాలు, ఘర్షణలు బహుశా ఎక్కడా జరిగి ఉండవు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ స్థానికంగా సృష్టించే అల్లర్లపై ఎన్నో కేసులు కూడా నమోదయ్యాయి. ఒకప్పుడు అక్కడ జేసీ బ్రదర్స్ దే హవా. వారి మాటకు ఎనలేని విలువ ఉండేది. వారు చెప్పిందే శాసనంగా సాగేది.
ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక వారి ఆటలు సాగడం లేదు. మరోవైపు జగన్ సంక్షేమ ఫలాలతో అక్కడ పార్టీ కూడా ప్రజాదరణ పొందుతోంది. ఫలితంగా టీడీపీ ప్రాభవం కోసం పాకులాడాల్సిన పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అది కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొంత మంది అభ్యర్థులునైనా గెలిపించుకోవాలని మండుటెండలో జేసీ ప్రభాకర్ రెడ్డి విస్తృతంగా పోరాడుతున్నారు.
తాడిపత్రి మున్సిపాలిటీ పోరు సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 3న జరిగే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం బరిలో ఉండే అభ్యర్థులు తేలనున్నారు. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో నిమగ్నమయ్యాయి. తెలుగుదేశంపార్టీ అభ్యర్థుల తరుపున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, వైకాపా తరుపున ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి పురపోరు ప్రచారంలో పాల్గొంటున్నారు. పట్టణంలోని వార్డులన్నీ తిరుగుతూ తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
జేపీ ప్రభాకర్ రెడ్డి ప్రచారం పరిశీలిస్తే ఎన్నడూ లేని విధంగా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. 13వ వార్డు సుంకులమ్మ పాలెంలో అభ్యర్థి రఘు విజయం కోసం జేసీ పడరాని పాట్లు పడుతున్నారు. 17వ, 23వ వార్డుల లోనూ విస్తృతంగా తిరుగుతున్నారు. అభ్యర్థి కంటే ఆయనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒక్కోసారి ఓపిక లేక అటొకరిని, ఇటొకరిని పెట్టుకుని వారి భుజాల ఆసరాగా మరీ ప్రచారం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
తాటిపర్తి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. గతంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ అంటే విస్తృతమైన పోటీ ఉండేది. కౌన్సిలర్ టికెట్ కోసం కూడా పెద్ద స్థాయిలో పైరవీలు జరిగేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఏడెనిమిది వార్డులు మినహా మిగతా చోట్ల ఆ పార్టీ టికెట్ కోసం పెద్దగా పోటీ లేదు. మొత్తం మ్మీద టీడీపీ నుంచి 51 మంది నామినేషన్లు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఏకంగా 127 మంది నామినేషన్లు వేశారు. అలాగే బీజేపీ నుంచి 5గురు, సీపీఐ నుంచి 8 మంది, జనసేన నుంచి ఒకరు, 13 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నేటి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. సాయంత్రానికి ఎంత మంది బరిలో ఉన్నారనేది క్లారిటీ వస్తుంది.
2019 జాబితా ప్రకారం తాడిపత్రి మున్సిపాలిటీలో 83,739 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 41,341 మంది పురుష ఓటర్లు కాగా.. 42,383 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 208 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఎంత మంది చివరగా నిలిచేదో తేలాల్సి ఉంది. ఎలాగోలా అన్ని వార్డుల్లోనూ తమ పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించి జేసీ ఇప్పుడు వారి విజయం విశేషంగా ప్రచారంలో తిరుగుతున్నారు. మరి ఆయన కష్టానికి ప్రజలు ఎన్ని వార్డులను ఇస్తారో వేచి చూడాల్సిందే.