Idream media
Idream media
అనంతపురం జిల్లాలోని మెజార్టీ ప్రాంతాల్లో ఒకప్పుడు వారు చెప్పిందే వేదం.. రాజకీయాలు వారి కనుసన్నల్లో ఉండేవి. పదవి ఏదైనా వారి సిఫార్సులే నడిచేవి. ఇప్పుడు కాలం మారినట్లు కనిపిస్తోంది. వారి పెత్తనం మాకొద్దంటూ మెజారిటీ నేతలు ధీంకరిస్తున్నారు. మా ప్రాంతంలో వారి జోక్యం చేసుకోకుండా చూడాలని అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. వారే జేసీ సోదరులు. ఇటీవల కాలంలో తరచూ వివాదాస్పదమవుతున్న జేసీ బ్రదర్స్ పై ఇప్పుడు సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతోంది. వారు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత.. జిల్లాలో పార్టీ బలపడడం కన్నా.. బలహీనపడిందని కొంత మంది నేతలు టీడీపీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా వారిని తాడిపత్రి వరకే పరిమితం చేసి మిగతా నియోజకవర్గాలు జోలికి వెళ్లొద్దని చెప్పాలని వారు అధినాయకులకు మొర పెట్టుకుంటున్నారు.
పెద్దన్న పాత్రకు చెక్..
తెలుగుదేశంలో చేరిన తర్వాత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలో పెద్దన్న పాత్ర పోషించేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అది చెల్లుబాటు అయింది. ఇప్పుడు అక్కడ కూడా తెలుగుదేశం ప్రాభవం తగ్గుతూ వస్తోంది. ఇందుకు జేసే సోదరుల వ్యవహార శైలే కారణమని సొంత పార్టీలోనే పలువురు ఆరోపణలు చేస్తున్నారు. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని నలుగురు ఇన్ చార్జులు జేసే సోదరులను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ నియోజకవర్గం సమావేశంలో ఈ విషయాన్ని పార్టీ పరిశీలకుడి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆయన ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరి నియోజకవర్గాల్లో వారు కార్యక్రమాలు చేసుకోకుండా ఇతర ప్రాంతాల వైపు చూడడం వల్ల పార్టీకి నష్టం చేకూరుతోందని తెలిపారు. జేసీ సోదరుల వ్యవహారశైలితో తాడిపత్రిలోనే చాలా మంది పార్టీకి దూరమైనట్లు చర్చ జరుగుతోంది.
అంతర్గత విభేదాలు బహిర్గతం
అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ప్రతి చోటా అంతర్గత విభేధాలతో టీడీపీ ప్రాభవం కోల్పోతోంది. గ్రూపు తగాదాల కారణంగా, ఎవరికి మద్దతు తెలపాలో తెలియక కార్యకర్తలు తికమక పడుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఉన్న సమస్యలు చాలవన్నట్లుగా కొత్త కొత్త సమస్యలు తోడవడంతో అధిష్ఠానానికి తల బొబ్బలెక్కుతోందని జిల్లాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇందుకుమూల కారణం జేసీ సోదరులేనని అత్యధిక మంది నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటి వరకూ అంతర్గతంగా జరిగిన ఈ చర్చలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో జేసీ బ్రదర్స్ పై తిరుగుబావుటా ఎగురవేశారు.