iDreamPost
iDreamPost
ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. చంద్రబాబుతో కొన్ని ఏళ్లు బహిరంగ స్నేహం, ఇప్పుడు రహస్య మిత్రుత్వం నెరుపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అచ్చం ఆయనలాగే స్పందించి ఆ సామెతను నిజం అని నిరూపించారు. రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తోన్న ఉద్యమానికి జనసేన మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం తెలిపారు. అయితే ఈ సందర్భంగా చేసిన ప్రకటనలో అనేక అవాస్తవాలను జొప్పించారు. జీతాలు పెంచాల్సిన ప్రభుత్వం తగ్గించడమేంటని ఆయన ప్రశ్నించారు. జగన్ చేసిన మోసం వల్లే ఉద్యోగులు ఉద్యమబాట పట్టారని ఆరోపించారు.
ఏటా రూ.10వేల కోట్లు ఖర్చు పెరిగితే జీతాలు తగ్గించినట్టా?
ఉద్యోగులకు ఇచ్చిన కొత్త పీఆర్సీ వల్ల ఏటా రూ. 10,247 కోట్లు ఖజానాపై అదనపు భారం పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. మరి అటువంటప్పుడు జీతాలు పెరిగినట్టే కదా. జగన్ చేసిన మోసం వల్ల ఉద్యోగులు ఉద్యమబాట పట్టారంటున్న పవన్ ముఖ్యమంత్రి చేసిన ఆ మోసం ఏమిటో వివరిస్తే బావుండేదని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రితో జరిగిన భేటీలో 23 శాతం ఫిట్ మెంట్ కు ఒప్పుకొని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పి మరీ బయటకు వచ్చిన ఉద్యోగ సంఘాల నాయకులు ఆ తర్వాత ఆందోళన బాట పట్టారు. ఈ విషయంలో జగన్ చేసిన మోసం ఏముంది? విద్యావంతులు, నాయకత్వ అనుభవం ఉన్న ఉద్యోగ సంఘాల నేతలను సీఎం మోసం చేయడం సాధ్యమా? ప్రభుత్వం ఆరోజు ఏమి చెప్పిందో ఇప్పుడూ అదే చెబుతోంది. ఈ వాస్తవాలతో సంబంధం లేకుండా సీఎంపై
పవన్ విమర్శలు చేయడం ఆయన అవగాహనా రాహిత్యాన్ని బయట పెడుతోందని అంటున్నారు.
లాఠీచార్జ్ ఎక్కడ చేశారట?
అనేకమంది ఉద్యోగులను అరెస్టు చేసి కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేశారని పవన్ చేసిన ఆరోపణల్లో నిజంలేదని చెబుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగులను నిర్భంధించాలనో, అణచివేయాలనో అనుకుంటే వారు నిర్వహించిన ఛలో విజయవాడ విజయవంతం అయ్యేది కాదన్న సంగతి పవన్ తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
ఎవరు నిరీక్షించారు?
చర్చల పేరుతో గంటల తరబడి నిరీక్షించేలా చేసి ఉద్యోగులను అవమానించారని అనడాన్ని బట్టే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పవన్ కల్యాణ్ కు ఏపాటి అవగాహన ఉందో అర్థం అవుతోంది. చర్చల కోసం ప్రభుత్వం నియమించిన కమిటీయే ఉద్యోగ సంఘాల నేతల కోసం వేచిచూసింది. వారిని చర్చలకు రమ్మని పదే పదే విజ్ఞప్తి చేసింది. దీనికి పూర్తి భిన్నంగా ప్రభుత్వం తన చర్యలతో ఉద్యోగులను రెచ్చగొట్టిందని వ్యాఖ్యానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉద్యోగులపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని ప్రభుత్వానికి ఉచిత సలహా ఇచ్చిన పవన్.. ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో? ఎవరు సంయమనం పాటిస్తున్నారో
తెలుసుకోవాలని వైఎస్సార్ సీపీ నేతలు సూచిస్తున్నారు.
అవగాహన లేకుండా వ్యాఖ్యలా?
పోరాటానికి రాజకీయ పార్టీల అవసరంలేదని ఉద్యోగులు ప్రకటించడం వల్లే తాను ఇంతకాలం వీటిపై మాట్లాడలేదని పేర్కొన్న పవన్ వాస్తవాలను తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేది. ప్రజా సమస్యలపై సరైన అధ్యయనం లేకుండా అప్పుడప్పుడూ బయటకు వచ్చి ఏవేవో వ్యాఖ్యలు చేసే పవన్ ఉద్యోగుల ఆందోళనపై కూడా అలాగే స్పందించారు. ఏడేళ్లుగా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ, పాతికేళ్ల పాటు రాజకీయాలు చేస్తానంటున్న నాయకుడు సమస్యలపై కనీస అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం ఏం పద్దతి అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.