Idream media
Idream media
కృష్ణా, గోదావరి నది నిర్వహణ బోర్డుల ఏర్పాటు, అందులో పేర్కొన్న అంశాలపై తెలుగు రాష్ట్రాల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంతో.. గెజిట్ నోటిఫికేషన్లపై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే రెండు నదుల బోర్డులను ఏర్పాటు చేశామని శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. నీటి పంపకాలు కూడా విభజన చట్టం ప్రకారమే చేశామని తెలిపారు. 2014 నుంచి కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)లపై కసరత్తు జరుగుతోందని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు పేర్కొన్నారు.
విభజన చట్టం సెక్షన్ 84 ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఏర్పడిందని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌లో జలశక్తి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారని పేర్కొన్నారు. 2016 సెప్టెంబర్‌లో మొదటిసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిందని, అయితే అప్పుడు ఓ నిర్ణయానికి రాలేకపోయామని తెలిపారు. 2020 అక్టోబర్‌లో మరోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిందని, ఆయా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా, విభజన చట్టం ప్రకారం బోర్డుల పరిధిని నిర్ణయించామని వివరించారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నిన్న రాత్రి గెజిట్లను విడుదల చేశామని స్పష్టం చేశారు. సీడబ్యూసీతో సంప్రదింపులు చేసిన తర్వాతే తుది నిర్ణయానికి వచ్చామని తెలిపారు. అన్ని ఆలోచించిన తర్వాతే ప్రతి పదం, ప్రతి వాక్యం రాశామని చెప్పారు.
రెండు బోర్డుల నిర్వహణ వ్యయాన్ని ఇరు రాష్ట్రాలు సమానంగా భరించాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 60 రోజుల్లోపు బోర్డుల నిర్వహణ కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 200 కోట్ల రూపాయల చొప్పన జమ చేయాలని అధికారులు పేర్కొన్నారు. బోర్డుల నిర్వహణకు నిధులు, వనరుల కొరత రాకూడదని స్పష్టం చేశారు. ఏది ఆమోదం పొందిన ప్రాజెక్టు.. ఏది ఆమోదం పొందని ప్రాజెక్టో నిర్వచించామని తెలిపారు. బి–పార్ట్ షెడ్యూల్‌లో ఉన్నంత మాత్రాన అనుమతి పొందినట్లు కాదన్నారు. నోటిఫికేషన్‌లోని షెడ్యూల్ 2 పూర్తిగా బోర్డు పరిధిలో ఉంటుందని చెప్పారు. షెడ్యూల్ 3లో ఇప్పుడు ఉన్నట్లుగానే రాష్ట్రాల పరిధిలో ఉంటుందని వివరించారు. బోర్డుల సూచన మేరకే ఇరు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవాలని జలశక్తి అధికారులు స్పష్టం చేశారు.
Also Read : బోర్డు చేతుల్లోకి కృష్ణా, గోదారి నీళ్లు, ఏం జరుగుతోంది..ఏం జరగబోతోంది