ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగార కార్మికులు, ఉద్యమకారుల మనసులను గెలుచుకున్నారు. ఈ విషయాన్ని అక్కడ ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘాల నేతలు వెల్లడించడం, జగన్ ఇచ్చిన హామీలపట్ల విశ్వాసం ప్రకటించడం జగన్ విజయాన్ని ధృవీకరించాయి.
జగన్ విశాఖపట్నం వెళ్ళడానికి సరిగ్గా 24 గంటల క్రితమే ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటించి కార్మికుల పోరాటానికి మద్దతు పలికారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రవేటు పరం చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం లేకపోయినా చంద్రబాబు తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి టీడీపీ అభిమానులను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు తన సుదీర్ఘ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానీ ఒక్క మాట కూడా అనకపోవడం కార్మికులను నిరాశ పర్చింది. కేంద్రంపై బాణం ఎక్కుపెట్టకుండా ఎలాంటి పాత్రా లేని రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు దాడి చేయడం కార్మికుల పోరాటానికి ఏమాత్రం ఉపయోగపడే అంశం కాదని కార్మికులందరూ గుర్తించారు.
ఈ పరిస్థితుల్లో విశాఖ చేరుకున్న జగన్మోహన్ రెడ్డి నేరుగా పోరాటం చేస్తున్న కార్మిక సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ముందుగా కార్మిక సంఘాల నేతలు చెప్పిన విషయాలు సావధానంగా విన్న జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కును కాపాడేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను కార్మిక నేతలకు వినిపించారు. అలాగే ఉక్కును కాపాడేందుకు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తామని కమిట్ అయ్యారు. అలాగే ప్రధానమంత్రితో మరోమారు మాట్లాడి విశాఖ ఉక్కుకు సొంతంగా గనులు కేటాయించేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు.
ఈ హామీలకు తోడు మరో ప్రధానమైన హామీ ఇచ్చి కార్మికుల మనసు గెలుచుకున్నారు. ఇప్పటివరకూ విశాఖ ఉక్కును పోస్కో సంస్థకు అప్పగించేందుకు జగన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబు నాయుడు, ఇతర ప్రతిపక్ష నేతలు చేస్తున్న ప్రచారాన్ని బద్దలుకొడుతూ విశాఖ ఉక్కులోకి పోస్కో సంస్థ ప్రవేశించిందని స్పష్టం చేశారు. ఈ మాటతో ప్రతిపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టేశారు జగన్. ఇక పోస్కో ప్రతినిధులతో తన సమావేశం వారిని కడప ఉక్కు వైపు కానీ, భోగాపురం వైపు గానీ మళ్లించేందుకే అని మరోసారి స్పష్టం చేశారు.
ఈ అంశాలు కార్మికులతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా విశాఖ ఉక్కుపై జగన్ అభిప్రాయం, జగన్ పాత్ర, ఆయన చిత్తశుద్ధి అర్ధం అయినట్టు కనిపిస్తోంది. విశాఖ ఉక్కు పేరుతో ఎంతో కొంత రాజకీయం చేద్దాం అనుకున్న చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులకు జగన్ ప్రకటన తీవ్ర నిరాశ కలిగించిందనే చెప్పవచ్చు. అదీ కాక, విశాఖ ఉక్కు ఉద్యమం పేరుతో ప్రత్యక్ష పోరాటంలోకి దిగాలని ప్రయత్నాలు చేస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా గంటా ఇప్పటికే రెండుసార్లు తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మొదటిసారి రాజీనామా లేఖను కార్మిక సంఘాల నేతలకు అప్పగించారు. ఆ రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్ లో లేకపోవడం, లేఖను స్పీకర్ కు అందించేందుకు కార్మిక సంఘాల నేతలు సిద్ధంగా లేకపోవడంతో గంటా మరోసారి రాజీనామా లేఖ రాశారు. ఈ సారి తన లేఖను స్పీకర్ ఫార్మాట్ లో రాసి విశాఖ జర్నలిస్టు ఫోరమ్ నాయకులకు అప్పగించారు. విశాఖ పాత్రికేయ నేతలు కొందరు ఆ లేఖను విజయవాడలో స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. అయితే స్పీకర్ ఈ లేఖపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కాగా, ప్రజల్లో సెంటిమెంటుగా ఉన్న విశాఖ ఉక్కు అంశంలో ఎంతో కొంత చొరవ తీసుకుని రాజకీయ లబ్ది పొందాలని భావించిన నేతలను, పార్టీలను జగన్ తన ప్రకటనతో పక్కనపెట్టేసినట్టయింది. జగన్ పర్యటన, ఆయన ప్రకటనతో కార్మిక సంఘాల నేతలు పూర్తిగా విశ్వాసం ప్రకటించడంతో పాటు, భరోసాతో ఉన్నట్టు కనిపించారు. ఈ భరోసా ఇవ్వగలగడం ద్వారా విశాఖ ఉక్కు ఉద్యమాన్ని జగన్ గెలుచుకున్నట్టయింది.
ఇక ఈ అంశంపై జగన్ ఎంతమేరకు పనిచేస్తారో, విశాఖ ఉక్కు ప్రవేటు పరం కాకుండా ఉండేందుకు ఏమేరకు ప్రయత్నం చేస్తారో అనేదానిపై విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులే కాక యావత్ రాష్ట్ర ప్రజల మద్దతు పొందటం, పొందలేకపోవడం వంటి వాటిపై ఆయన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే విశాఖ ఉక్కు భవిష్యత్తే జగన్ రాజకీయ భవిష్యత్తు అని కూడా అనుకోవచ్చు. వాస్తవానికి విశాఖ ఉక్కుతో జగన్ రాజకీయం ముడిపడి లేకపోయినా విశాఖ పర్యటనలో ఆయన ఇచ్చిన హామీలు ఈ ముడిపెట్టాయి. ఇప్పుడు విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత జగన్ పైనే ఉంది.