కరోనా కారణంగా అమలులోకి వచ్చిన లాక్ డౌన్ మొత్తం వ్యవస్థను చిక్కుల్లో నెట్టింది. అందులో రైతులు మరింత ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా పంట చేతికి వచ్చిన వేళ వాటిని మార్కెట్ కి తరలించడం పెద్ద సమస్యగా మారింది. మార్కెట్ కి కష్టపడి తీసుకెళితే ధర లేక తల్లడిల్లాల్సి వచ్చింది. దాంతో రైతుల సమస్యలపై సర్కారు కదిలింది. అనేకమంది ఆందోళన చెందుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం చూపిన చొరవ ఇప్పుడ కొంత ఫలితాలు ఇస్తోంది.
ఏపీలో పలు పంటలు కోత దశకు వచ్చాయి. ముఖ్యంగా ఉద్యానవన పంటలు, కూరగాయల పరిస్థితి కల్లోలంగా మారింది. రైతులు తీవ్రంగా కలవరపడాల్సి వచ్చింది. 30కిలోల టమోటా రూ.30లకు అమ్ముకోవాల్సిన రైతు ధైన్యం వాస్తవాన్ని చాటింది. ఈ పరిస్థితులపై ఏపీ సీఎం స్పందించడం, వ్యవసాయం, రైతుల పరిస్థితిపై సమీక్షలు జరపడంతో ఇప్పుడు కదలిక మొదలయ్యింది. కేంద్రంతో మాట్లాడి వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఆటంకం లేకుండా చూడడంతో ఇప్పుడు సమస్య పరిష్కారం దిశగా సాగుతోంది.
ఇప్పటికే చిత్తూరు నుంచి పాల ట్యాంకర్లు బయలుదేరాయి. మదనపల్లి నుంచి టమోటా లోడ్లు అటు తమిళనాడు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు కదిలాయి. కడప నుంచి చినీపళ్ల ఎగమతులు మొదలయ్యాయి. రాష్ట్రంలోని వివిధ మార్కెట్ల నుంచి మామిడి కాయలు ఉత్తరాది రాష్ట్రాలకు బయలుదేరాయి. అన్నింటికీ మించి ఆక్వా రైతుల ఆందోళన విషయంలో ప్రభుత్వం స్పందించి, నిర్ధిష్ట ధరను నిర్ణయించడంతో విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి ఆక్వా ఉత్పత్తుల ఎగమతులతో షిప్పులు బయలుదేరాయి. అయితే రొయ్యల చెరువుల ఉంచి ఎక్కువగా పట్టుబడలు కాలం కావడంతో ఆక్వా విషయంలో ప్రభుత్వం మరింత చొరవ చూపాలని రైతులు కొరుతున్నారు.
అరటి సహా అన్ని పంటల విషయంలో ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన సమస్యలను అధిగమించే దిశలో తీసుకున్న చర్యలు రైతులకు ఊరటనిస్తున్నాయి. మరోవైపు మార్కెట్ లో వినియోగదారులకు కూడా ఊరట కల్పించే నిర్ణయం మారుతోంది. ఈప రిస్థితులలో రైతుల సమస్యలపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి తీరు పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనాడు వంటి పత్రికల్లో కూడా వ్యవసాయ ఉత్పత్తులు సాగుతున్నట్టు కథనాలు రావడం గమనిస్తే ప్రభుత్వ వ్యతిరేకులు అంగీకరించక తప్పడం లేదంటున్నారు.