రెండుగా విడివడుతున్న కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను నిమ్మకూరు వాసులు స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబానికి బంధువులు కలిశారు. నందమూరి కుటుంబానికి చెందిన దూరపు బంధువులు నందమూరి పెద వెంకటేశ్వరరావు, నందమూరి జయసూర్య సహా నిమ్మకూరులో నివాసం ఉండే చిగురుపాటి మురళి అనే వ్యక్తి సీఎం జగన్‌ను కలిశారు. మంత్రి కొడాలి నాని, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వారిని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి తీసుకువచ్చారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చారు అని ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత మంత్రి కొడాలి నాని తెలిపారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని గతంలో నిమ్మకూరు మీదుగా వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఎన్టీఆర్ గ్రామస్తులు కోరారని, అప్పుడు ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఇప్పుడు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినట్లు తెలిపారు. ఇక తాజాగా ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఆయనకు ధన్యవాదాలు తెలిపిన నిమ్మకూరు వాసులు నిమ్మకూరులో ఉన్న చెరువులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహన్ని పెట్టాలని కోరగా అందుకు సీఎం రెండో ఆలోచనే లేకుండా అంగీకరించారని మంత్రి తెలిపారు.
నందమూరి తారక రామారావు మరణించిన నాటి నుంచి ఆయన గ్రామంలో ఒక మంచి విగ్రహం ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తున్నామని అప్పటి నుంచి ఎవరూ పట్టించుకోలేదు కానీ గ్రామస్తులు కోరిన వెంటనే జగన్ ఒప్పుకున్నారని మంత్రి నాని వెల్లడించారు. ఎన్టీఆర్ జన్మించి వందేళ్లు నిండిన సందర్భంగా మేలో విగ్రహాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేసేందుకు సీఎం అంగీకరించినట్లు కొడాలి నాని ప్రకటించారు. మరోపక్క నిమ్మకూరులో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు పైప్ లైన్ కోసం కోటి రూపాయలను సీఎం మంజూరు చేసినట్లు పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ ప్రకటించారు. గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు సీఎం ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.