దేశంలో ఏ రాష్ట్రంలోనయినా అనుకోని ఘటనలు వెలుగులోకి రావడం కొత్త కాదు. ఇకపై ఆగదు కూడా. కానీ అలాంటి ఘటనల ద్వారా కుల, మత రాజకీయాలకు ప్రేరేపించే తరగతి పెరుగుతుండడం ప్రమాదకర సంకేతంగా మారుతోంది. అలాంటి కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం రావణకాష్టను రాజేయాలని చూస్తున్న తీరుపై ఏపీ సీఎం స్పందన చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఓ ఆలయ రథం కాలిపోయిన ఘటనపై అత్యున్నత దర్యాప్తు సంస్థను విచారణ కోరడం విశేషంగా చెప్పవచ్చు. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న వారందరికీ ముకుతాడు వేసిన చర్యగా మారింది. దాంతో అంతర్వేది ఘటన కొత్త మలుపు తిప్పిన సీఎం జగన్ ఎత్తులకు అటు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య భక్తుల్లో కూడా హర్షాతికేతాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు సీఎంగా ఏపీల సీబీఐని అడుగుపెట్టనిచ్చేది లేదని ప్రకటించారు. కానీ ఇప్పుడు సీబీఐ దర్యాప్తు కోరుతుంటారు. చిన్న విషయాలకు కూడా ఆయన సీబీఐ అనడం పరిపాటిగా మారింది. అదే సమయంలో స్వర్ణా ప్యాలస్ ఘటనలో రమేష్ ఆస్పత్రి పాత్రపై ఆయన నోరుమెదపరు. మనుషులు కాలిపోయినా మానవత్వం చాటేందుకు సిద్ధపడకుండా, చివరకు విచారణకు అడ్డుపడుతుంటారు. అదే సమయంలో ఓ రథం కాలిపోతే దాని మీద నానా హంగామా చేస్తారు. టీడీపీ తరుపున విచారణ బృందాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. తద్వారా ప్రజల ప్రాణాల కన్నా తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు చాటుకున్నట్టు ప్రజలంతా గ్రహించారు. తమ సామాజికవర్గీయుల విషయంలో ఆయన చూపుతున్న వైరుధ్యం గుర్తించారు.
చంద్రబాబుకి తోడుగా ఆయన భావాలను తన మాటల్లో వల్లించడానికే ఉన్నట్టుగా కనిపించే పవన్ కళ్యాణ్ కూడా అదే పరంపర. ఏపీలో ఎల్జీ పాలిమర్స్ నుంచి విజయవాడ ఘటన వరకూ పలు ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు పోతే కనీసం స్పందించి, వారికి తోడుగా ఉండే ప్రయత్నం చేయలేదు. కానీ రథం కాలిన ఘటనలో దీక్షలకు దిగారు. కరోనా విపత్తు వేళ విపక్ష నేతగా ప్రజలకు తోడుగా ఉండాల్సింది పోయి హైదరాబాద్ లో కూర్చున్న పవన్ కళ్యాణ్ కూడా నీతులు వల్లించే ప్రయత్నం చేశారు. కుల రాజకీయాలలో ఫలితం దక్కలేదని గ్రహించి మత రాజకీయాలకు పూనుకున్నారు. తన మిత్రపక్షం బీజేపీ బాటలో నడుస్తూ అంతర్వేది అంశాన్ని అంతర్జాతీయ అంశం అన్నట్టుగా చిత్రీకరించేందుకు సిద్ధపడ్డారు. చివరకు కొందరు జనసైనికులు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మీద ఉన్న దుగ్ధతో ఎంతటికైనా తెగించే అల్లరిమూకలను తలపించేలా వ్యవహరించారు.
బీజేపీ కూడా తన సహజధోరణిలో వ్యవహరించింది. ఆర్ఎస్ఎస్ అనుబంద సంఘాల ద్వారా అంతర్వేది అంశాన్ని మరింత రాజేసేందుకు ప్రయత్నించాయి. అంతర్వది రథం అంశంలో స్పందించిన సదరు పార్టీ నేతలు, ఆందోళనకారులు కొందరు ఇతర మతస్తుల ఆలయాలపై రాళ్లురువ్వడాన్ని కనీసం ఖండించిన దాఖలాలు లేవు. అంటే ప్రశాంత కోనసీమలో చిచ్చురేపే శక్తులకు అవకాశం ఇచ్చినట్టే కనిపిస్తోంది. మత విద్వేషాలు రాజేందుకు చేస్తున్న యత్నాలకు అడ్డుచెప్పేందుకు సిద్ధపడలేదని స్పష్టమవుతోంది.
రాజకీయ లక్ష్యాలతో విపక్ష పార్టీలు సాగుతున్న వేళ జగన్ తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలుత మంత్రుల బృందం, పోలీస్ ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ తరుపున అధికారులు కదిలారు.
రాబోయే రథయాత్రకు ఆటంకం లేకుండా వచ్చే జనవరి నాటికి రథం చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో డీఐజీ స్వయంగా అంతర్వేదిలో క్యాంప్ చేసి దర్యాప్తు చేపట్టారు. అయినప్పటికీ విపక్షాలు ఉన్నత స్థాయి దర్యాప్తు కోరడంతో వెంటనే స్పందించి సీబీఐకి లేఖ రాశారు. విచారణ చేసి దోషులను పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ స్పందించగానే కేసును అటు బదిలీ చేసేందుకు సిద్ధపడ్డారు. తమ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉంటుందో, నేరాల పట్ల ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తుందో చాటిచెప్పారు. విపక్షాలు సైతం ఆశ్చర్యపోయాలే సీబీఐని ఈ కేసులో అంగీకరించడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మతాల ఆధారంగా రాజకీయాలు చేయాలనుకునే వారికి ఇది చెంపపెట్టు అవుతుందని, విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ప్రభుత్వం సహించదని చెప్పిన తీరుని అభినందిస్తున్నారు. మొత్తంగా అంతర్వేది అంశంతో రాజకీయాలు చేయాలనుకున్న సెక్షన్ కి బ్రేక్ వేస్తూ జగన్ తనదైన శైలిలో ప్రజల్లో నిలిచిన తీరు ఆయన పరణతికి నిదర్శనంగా చెప్పవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.