iDreamPost
android-app
ios-app

యాతలూరి జ్యోతి లాంటి లక్షలాది మహిళల కలని నిజం చేసిన జగన్

  • Published Dec 28, 2020 | 2:09 PM Updated Updated Dec 28, 2020 | 2:09 PM
యాతలూరి జ్యోతి లాంటి లక్షలాది మహిళల కలని నిజం చేసిన జగన్

సొంతిల్లు అన్నది ప్రతి పురుషుడికి లక్ష్యం అయితే , మహిళకి కల. భద్రత , భరోసా , స్థిరత్వాన్ని కలిగించే సొంత ఇల్లు లక్ష్యంగా అనుదినం సాగుతుంటాయి మహిళల ఆలోచనలు . రూపాయి రూపాయి పొదుపు చేస్తూ స్వల్ప కోరికలు కూడా అనుచుకొంటూ ఇంటి కోసం డబ్బు కూడబెడుతుంటారు . ఇది అందరికీ సాధ్యం కాదు . సొంతింటి కల నెరవేర్చుకోలేని అభాగ్యులు ఎందరో . కొందరు సంచార కులస్తులు , ఊరికి దూరంగా పొలాలకు దగ్గరగా బతికే కొన్ని వర్గాలు , అడవుల్ని ఆనుకొని జీవించే కొన్ని జాతులు లాంటి వారికి పూర్తి స్థాయి రక్షణ కల్పించే సొంతిల్లు అనేది కలగానే మిగిలిపోతుంది .

ఇలాంటి వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో , ఆర్ధిక సాయంతో కొందరికి ఇల్లిస్తామని వాగ్దానాలు చేస్తుంటాయి కానీ అమల్లోకి వచ్చేసరికి మొండి చేయి చూపిస్తుంటాయి . అడపాదడపా కొన్ని ఇళ్ళు ఇచ్చినా అవి అత్యవసరమైన సామాన్యులకు కాక తమ రాజకీయ పార్టీలో అనుయాయులకి , సిఫార్సులు పొందిన వారికీ ఇస్తారు తప్ప మళ్లీ ఎన్నికల నాటి వరకూ ఈ సామాన్యుల మొహం కూడా చూడరు .

ఆ పరిస్థితి మార్చిన అతి కొద్దిమంది నాయకుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు . నాడు ఇందిరమ్మ ఇళ్ల పేరిట వైఎస్ కట్టించిన లక్షల ఇళ్లతో ఇల్లు కట్టుకోలేని పలువురు అసహాయులు సొంతింటికి యజమానులయ్యారు . మళ్లీ ఇప్పుడు పెరిగిన జనాభా , కొత్తగా ఏర్పడ్డ కుటుంబాలకు అనుగుణంగా అవసరమైన ఇళ్లను ఆయన తనయుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధినేత జగన్ కులమత రాజకీయాలకు అతీతంగా అందివ్వడానికి పూనుకోవడం అభినందనీయం .

ఈ నెల 25 నుండి వచ్చే జనవరి 7 వరకూ దాదాపు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టిన జగన్ లబ్ధిదారుల నుండే కాక రాష్ట్రంలోని మహిళలందరి చేత అభినందనలు అందుకొంటున్నారు . ముప్పై ఒక్క లక్షల కుటుంబాలకు ఇస్తున్న ఈ ఇళ్ల స్థలాలు ఇంటి యజమానైన పురుషుని పేరిట కాకుండా తనకు అక్క చెల్లెళ్ళ వంటి ఇంటి ఆడపడుచుల పేరిట ఇస్తాను అని చెప్పి రూపాయి నామ మాత్రపు ధరతో ప్రభుత్వ ఖర్చులతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుండటం , ఇంటి నిర్మాణాన్ని కూడా ప్రభుత్వమే చేసివ్వనుండటం లాంటి చర్యలు లబ్ది దారులైన మహిళలకే కాకుండా యావత్తు రాష్ట్ర మహిళల హర్షాతిరేకాలకు కారణభూతమైంది .

ఈ రోజు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలో భాగంగా జగన్ పాల్గొన్న సభలో మాట్లాడిన యాతలూరు జ్యోతి అనే మహిళ ప్రసంగం వింటే తన అక్క చెల్లెమ్మలు అని పిలుచుకునే మహిళల హృదయాల్లో జగన్ అన్నగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు అని చెప్పొచ్చు .

ఎవరీ యాతలూరు జ్యోతి …

ఒక యానాది మహిళ , భర్త ఇద్దరు పిల్లలతో కూడిన కుటుంబం . ఒక పల్లెటూరి చెరువు గట్టు పై తాత్కాలిక నివాసాల్లో జీవిస్తున్న ఇరవై ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబం . ఈ రోజు ఇళ్ల పట్టాలు అందుకొంటున్న మహిళల్లో జ్యోతి కూడా ఒకరు . ఇంటి పట్టా అందుకోవడంతో పాటు సీఎం పాల్గొన్న సభలో మాట్లాడే అవకాశం కూడా దక్కించుకొంది .

ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ తను చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అభాగ్యురాలినని తన ఇల్లు చెరువు కట్ట పై తాత్కాలిక నివాసమని రోజు వారీ కూలీతో జీవనం సాగిస్తున్న చిన్న కుటుంబమని తెలియజేసింది . వర్షమొస్తే చెరువులోనుండి కప్పలు , పొదల్లో నుండి వచ్చే పాములతో పిల్లలకు రక్షణ లేక భయం భయంగా బతుకుతూ తుఫాను లాంటి సందర్భాల్లో లేచిపోయిన ఇంటి కప్పుని ఎండాకాలం బాగు చేసుకొని రోజులు వెల్లదీస్తున్నామని , ఇంతకు ముందు ప్రభుత్వాల హయాంలో పక్కా ఇంటి కోసం , రేషన్ కోసం కూలి పని మానుకొని ప్రభుత్వ కార్యాలయాల కోసం తిరిగినా ఎవరూ కనికరించలేదని వాపోయింది యాతలూరి జ్యోతి .

వైసీపీ అధికారంలోకి వచ్చాక తనకు కార్యాలయాల చుట్టూ కాల్లరిగేలా తిరిగే పని తప్పిందని వలంటీర్లే తన ఇంటి తలుపు తట్టి మామకి పింఛను ఇస్తున్నారని , పిల్లల చదువుకు అమ్మవడి పధకం డబ్బులు పడ్డాయని , విద్యా కానుక పధకం కింద పిల్లలకు బట్టలు , పుస్తకాలు అందాయని వారి చదువు బాధ్యత మొత్తం తీసుకొన్న అన్నగా నా పిల్లలకు మేనమామగా జగనన్నని భావిస్తున్నానన్న జ్యోతి , ఇంటి స్థలం దరఖాస్తు కూడా వలంటీర్లే తన ఇంటికొచ్చి తన చేత పూర్తి చేయించారని జగన్ కి కృతజ్ఞతలు తెలిపింది .

ఇన్నాళ్లు చెరువు కట్ట మీద బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న తమతో పాటు సాటి ఇరవై ఐదు కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందాయని చెప్పిన జ్యోతి , ఇన్నాళ్లు అడ్రెస్ లేని తనకు ఈ రోజు జగన్ అన్న అడ్రెస్ కల్పించాడని నా ప్లాట్ నెంబర్ 305 అని చెబుతూ ఒకింత ఆనందోద్వేగానికి గురయింది .తనకు కరోనా వచ్చిన సందర్భంలోనూ అండగా నిలిచిన జగన్ తల్లితండ్రి లేని తనకు అన్నగా అండగా నిలవటమే కాక ఇంటి స్థలం తన పేరుతో ఇవ్వటంతో తనకు కుటుంబంలో , సమాజంలో ఓ గౌరవనీయ స్థానం కల్పించాడని నాతో పాటు నా బిడ్డల తరం కూడా మీకు రుణపడి ఉంటామని తెలిపిన జ్యోతి మాటల్లో ఒకఇంటి యజమానురాలిని చేసిన కృతజ్ఞత తప్ప ఒక్క మాట కూడా కృతకంగా అనిపించకపోవడం విశేషం .

రాజకీయలకతీతంగా ఒకేసారి ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం రాష్ట్ర ప్రజలలో ఓ సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చింది అని చెప్పొచ్చు . అంతే కాదు రానున్న రోజుల్లో రెండు దఫాలుగా 28 లక్షల ఇల్లు నిర్మించి ఇవ్వనుండటం పలు వృత్తి , వాణిజ్య రంగాలకు వ్యాపార , ఉపాధులు కల్పించటమే కాక కరోనా ఇతర కారణాల వలన స్తబ్దుగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక రంగంలో కూడా ఒక వేగవంతమైన కదలిక తెస్తుందని చెప్పొచ్చు .