iDreamPost
iDreamPost
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ శాతం నగదును ఉపయోగిస్తున్నారని అయితే వారిని సాంకేతికత వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అనేక సంస్థలు చెబుతున్న మాట. ఆర్బీఐ విడుదల చేసిన డేటా నివేదిక ప్రకారం.. గత రెండేళ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు 50 శాతం పెరగగా అందులో అధిక శాతం ప్రధాన, చిన్న నగరాల్లోని వినియోగదారులే అని చెబుతుంది. అయితే తాజాగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను సైతం అత్యంత సులభతరమైన , సురక్షితమైన డిజిటల్ లావాదేవీల వైపు మళ్ళించటానికి ప్రణాళికలు సిద్దం చేశారు.
ఈమేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై డిజిటల్ లావాదేవీలను ప్రొత్సహించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 సచివాలయాలో డిజిటల్ లావాదేవీలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయల్లో 543 రకాల సేవలను ప్రభుత్వం ప్రజలకు చేరువ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుని వస్తున్న ఈ డిజిటల్ లావాదేవీల ద్వారా గ్రామీణులు సైతం ఈ తరహా లావాదేవీలు నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కలిపిస్తుంది. సచివాలయాల్లో ప్రతి నగదు రహిత లావాదేవీలు జరిగిన వెంటనే సదరు వ్యక్తి మొబైల్ ఫోన్ కు తాను జరిపిన లావాదేవీకి సంభందించిన సమాచారం మెసేజ్ ద్వారా వస్తుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిద పధకాల ద్వారా నగదును నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలోకి జమచేస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు తీసుకువస్తున్న ఈ తరహా లావాదేవీలతో వారు నగదుని బ్యాంకు నుండి కానీ ఏటీయం నుండి కాని తీసుకోకుండానే నేరుగా మొబైల్ ఫోన్ ద్వారా తమ బ్యాంకులో ఉన్న నగదును వారి అవసరాలకు తగ్గట్టు కరెంటు బిల్లు లాంటి లావాదేవీలకు సచివాలయంలో వినియోగించుకునే అవకాశం ప్రభుత్వం వారికి కల్పిస్తుంది .
ఈ సేవలు ఉపయోగించుకునేందుకు గ్రామీణులు తమ దగ్గర UPI రిజిస్ట్రేషన్ కోసం ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన స్మార్ట్ఫోన్ తప్పనసరి. స్మార్ట్ఫోన్ ఉన్నవారు సదరు వ్యక్తికి సంభందించిన బ్యాంకు యొక్క మొబైల్ అప్లికేషన్ లేదా మూడవ పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని సంభందిత వివరాలు నమోదు చేసుకుని , లావాదేవీలు నిర్ధారించడం కోసం M-పిన్ సెట్ చేసుకోవడంతో లావాదేవీలు ప్రారంభించవచ్చు. ఈ తరహా లావాదేవీలు ఆర్బీఐ భరోసా ఉండటంతో పూర్తిగా సురక్షితం అని చెప్పవచ్చు. డిజిటల్ లావాదేవీలలో సాంకేతిక కారణంగా చెల్లిoపు విఫలం అయితే ఐదురోజుల్లోగా వినియోగదారుడి ఖాతాలోకి బ్యాంకులు తిరిగి నగదు జమచేయవలసి ఉంటుంది. ఒక వేల బ్యాంకులు నిర్ధిష్ట గడువులో చెల్లింపు విఫలం అయితే గడువు ముగిసిన నాటి నుండి రోజు 100 రూపాయల చొప్పున బ్యాంకులు వినియోగదారుడికి చెల్లించాల్సి ఉంటుంది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో రాష్ట్రం సాంకేతికంగా మరో అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు.