iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ ప్రోత్సాహకాలు – వైజాగ్ లో అదానీ డేటా సెంటర్.

  • Published Nov 23, 2020 | 3:40 PM Updated Updated Nov 23, 2020 | 3:40 PM
ప్రభుత్వ ప్రోత్సాహకాలు – వైజాగ్ లో అదానీ డేటా సెంటర్.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశాఖ రూపుదిద్దుకుంటున్న నేపధ్యంలో దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దం అవుతున్నాయి . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టి ప్రజలకు భారీ స్థాయిలో ఉపాధి కల్పించే సంస్థలకు అదే స్థాయిలో రాయితీలు ప్రకటించి పెట్టుబడులను ఆకర్షిస్తుంది . ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఒక పక్క జగన్ ప్రభుత్వంలో పెట్టుబడులు రావడంలేదు తన ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులు సైతం ఈ ప్రభుత్వ విధానాల వలన వెనక్కి వెళ్ళిపోతున్నాయంటూ దుష్ప్రచారానికి పూనుకొన్నా వాస్తవ పరిస్థితులు చంద్రబాబు ఆరోపణలకు భిన్నంగా కనపడుతున్నాయి .

గత ప్రభుత్వ పాలన చివరిలో విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన అదానీ సంస్థకు చంద్రబాబు భారీ స్థాయిలో భూములు కేటాయించారు. కేవలం ఆరు వేలమందికి ఉద్యోగాలు కల్పించే సంస్థల స్థాపనకు 500 ఎకరాలు కేటాయిస్తూ ఒప్పందాలు చేసుకున్నారు. అయితే జగన్ అధికారంలోకి రాగానే అదానీ సంస్థకు ఇంత పెద్దమొత్తంలో భూమిని ఇచ్చేందుకు నిరాకరించి కొత్త ప్రతిపాదనతో ముందుకు రావాలని సూచించారు. ఇదే అదనుగా చంద్రబాబు జగన్ విధానాల వలన అదానీ లాంటి సంస్థలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయని , జగన్ ప్రభుత్వ పెట్టుబడుల విధానం వలన రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని తమ అనుకూల మీడియా సంస్థల ద్వారా దుష్ప్రచారానికి తెరలేపారు.

అయితే చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు చెక్ పడేలా అదానీ సంస్థ కొత్త ప్రతిపాదనతో రావడం దానిని ప్రభుత్వం సమీక్షించి ఆమోదించడం జరిగింది. అదానీ సంస్థ కొత్త ప్రతిపాదన ప్రకారం ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ పార్క్, ఇంటిగ్రేటెడ్‌ ఐటీ అండ్‌ బిజినెస్‌ పార్క్, రిక్రియేషన్‌ సెంటర్‌తో పాటు స్కిల్‌ యూనివర్సిటీ నిర్మాణాలకు విశాఖలోని మధుర వాడలో 130 ఎకరాలని కేటాయించారు, తద్వారా 24,990 మందికి ఉపాధి లభించేలా ప్రణాళికలు సిద్దం చేశారు . ప్రస్తుతం అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తూ ప్రోత్సాహాకాలు ప్రకటించింది.

డేటా సెంటర్ పార్క్, ఐటీ బిజినెస్ పార్కుకు 20 ఏళ్లపాటు విద్యుత్ ప్రోత్సాహకాలు జారీ చేసింది. 7 సంవత్సరాల పాటు 100% ఎస్ జీఎస్టీని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. 24 గంటల పాటు నీటి సరఫరాకు అంగీకారం తెలిపింది. ప్రాజెక్టు కోసం విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ ఎంటర్ప్రైజెస్ కి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఎలాంటి నివాసాలూ ఉండేందుకు వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. జగన్ ప్రభుత్వం అదానీ సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో పెట్టుబడుల విషయంలో చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలకు చెక్ పడిందనే చెప్పాలి.