iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇళ్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భాగంగా సీఎం జగన్ ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగానే రాష్ట్రంలో ఉన్న దాదాపు 30 లక్షలమంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసేందుకు జగన్ సర్కార్ సిద్దమైన విషయం తెలిసిందే. తొలుత వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్దమైతే టీడీపీ నేతలు సాంకేతిక కారణాలు లేవనెత్తుతూ కేసులు వేసి ఇళ్ళపట్టాల పపిణీ జరగకుండా అడ్డుపడుతూ వచ్చారు.
తెలుగుదేశం నాయకులు కేసులు వేసిన నేపధ్యంలో జగన్ సర్కార్ ఇళ్ళ పట్టాలను ఉగాది నాడు, ఆ తరువాత ఆగస్టు 15న పంపిణీ చేయడానికి ప్రయత్నించినా కోర్టుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా ప్రభుత్వం ముందడుగు వేయలేకపోయింది. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 25న ప్రారంభించేందుకు రంగం సిద్దం చేసింది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమం చేపట్టి అర్హులకు డి-ఫామ్ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్దమైంది.