iDreamPost
iDreamPost
కరోనాతో సహజీవనం తప్పదు..వ్యాక్సిన్ వచ్చే వరకూ కరోనాకి మందు కూడా లేదు. పారాసెటమాల్ వేసుకుని జ్వరం తగ్గించుకోవాల్సిందే. ఈ మాటలు అందరికన్నా ముందు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అది కూడా మార్చి 15,2020లోనే ఆయన ఈప్రకటన చేశారు. ఆనాటికి కరోనా కి సంబంధించి దేశంలో లాక్ డౌన్ కూడా లేదు. అయినా జగన్ ముందుచూపుతో ఈ మాటలన్నారు. కానీ వాటిని పట్టుకుని కొందరు ట్రోల్ చేశారు. జగన్ అంటే గిట్టని వారు ఎద్దేవా చేశారు. ఇప్పటికి రెండేళ్ళవుతోంది. కరోనా పోయిందా.. వ్యాక్సిన్ తప్ప మరో మందు ఇప్పటికీ కనిపెట్టలేదు కదా. అంటే జగన్ ముందుచూపుతో చెప్పిన మాటలే ఆచరణలో చూడాల్సి వస్తోంది కదా.
జగన్ ఏమీ శాస్త్రవేత్త కాదు. అలా అని వైద్యరంగంలో నిపుణుడు కూడా కాదు. అయినా ప్రపంచంలో వైరస్ మహమ్మారి విస్తరణకు సంబంధించి ఉన్న వాస్తవికతను ఆయన అంచనా వేశారు. అదే రాష్ట్ర ప్రజల ముందుంచారు. ఆందోళన చెందవద్దు అన్నారు. కోవిడ్ బాధితుల్లో ఒకటి, రెండు శాతం మించి మరణాలుండవన్నారు. పది శాతం లోపు మంది మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందన్నారు. సరిగ్గా అదే జరిగింది. నేటికీ జరుగుతోంది. కానీ ఆనాడు జగన్ మాటలను పట్టుకుని సోషల్ మీడియాలో చెలరేగిన బ్యాచ్ మాత్రం ఇప్పుడు నోటమాటలేక మౌనంగా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చి అప్పటికింకా ఏడాది కూడా పూర్తికాలేదు. అయినా ఎంతో అనుభవం ఉన్న నాయకుడి మాదిరిగా ప్రజలకు భరోసా కల్పించడంలో అందరికన్నా ముందున్నారు.
అంతేగాకుండా పిల్లల చదువుల విషయంలో జగన్ చూపించిన చొరవ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాపిస్తున్న తరుణంలో అనేక రాష్ట్రాల్లో బడులు మళ్లీ మూతపడుతున్నాయి. లెక్కలు తీస్తే 2020 మార్చి నుంచి ఇప్పటి వరకూ అత్యధిక కాలం స్కూళ్ళు నడిపిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కింది. రాష్ట్రంలో 2020 చివరిలో మొదటి వేవ్ చల్లబడగానే స్కూళ్ళు తెరిచేందుకు అనుమతించారు. అప్పట్లో దానిని చాలామంది తప్పుబట్టారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం పట్టుదలగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ స్కూళ్ళు నడిపింది. సెకండ్ వేవ్ తర్వాత కూడా అదే జరిగింది. ఈకాలంలో పదో తరగతి , ఇంటర్ పరీక్షల విషయంలో విపక్షాలు నానా రాద్ధాంతం చేశాయి. అయినా జగన్ సర్కారు చొరవ పిల్లల భవిష్యత్తుకి ఆసరాగా నిలిచింది.
విద్యారంగమే అన్నింటికన్నా ఎక్కువగా ప్రభావితమయ్యింది. విద్యార్థులు ఎక్కువ కాలం స్కూళ్ళకు దూరంగా ఉండాల్సి రావడం వారి భవిష్యత్తుని దెబ్బతీస్తోంది. అలాంటి సమయంలో ముందు జాగ్రత్త చర్యలతో పాటుగా పరిస్థితిని సరిగ్గా అంచనా వేసిన జగన్ పట్టుదల ఏపీ విద్యార్థులకు ఊరటనిచ్చింది. అక్కడక్కడా కొన్ని స్కూళ్ళలో పిల్లలు , టీచర్లు కూడా కరోనా బారిన పడినప్పటికీ రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థులకు మాత్రం జగన్ నిర్ణయం ఎంతో ప్రయోజనం చేకూర్చింది. దేశంలో అనేక రాష్ట్రాలు మల్లగుల్లాలు పడుతున్న వేళ ఏపీ సర్కారు పట్టుదల అందరినీ కదిలించింది. నేటికీ ఒమిక్రాన్ వేళలో కూడా ఏపీ దిక్సూచిగా నిలుస్తోంది. ఆన్ లైన్ తరగతులంటూ విద్యార్థులకు అర్థంకాని చదువులకు బదులుగా బాధ్యతాయుతంగా బడులు కొనసాగించడం జగన్ చిత్తశుద్ధికి, సంకల్పబలానికి సాక్ష్యంగా ఉంటుంది.
Also Read : ఏపీకి ప్రశంసలు కొనసాగుతూనే ఉన్నాయ్