iDreamPost
iDreamPost
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. చాలాకాలంగా ఏపీలో సాగుతున్న కుల, మత వ్యవహారాలపై తన మనసులో మాటను బయటపెట్టారు. తన కులం, మతం గురించి పదే పదే ప్రస్తావిస్తున్న తీరు బాధపెడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు లో ఆరోగ్య శ్రీ పథకంలో ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఆరు నెలలుగా జగన్ పరిపాలన ప్రారంభం నుంచి కులం, మతం అంశాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాలు, ఒక వర్గం మీడియాలో పదే పదే ప్రస్తావనకు వస్తున్నాయి. ఏపీలో ఏదో జరిగిపోతోందనే సంకేతాలు ప్రపంచమంతా తెలిసేలా ఈ వ్యవహారం సాగుతోంది. వీటిపై పదే పదే వివరణలు ఇస్తున్నప్పటికీ వెనక్కి తగ్గని ధోరణి కనిపిస్తోంది. చివరకు ఏపీలో మతకలహాలకు ప్రయత్నిస్తున్నారంటూ టీటీడీ చైర్మన్ ఆందోళన వ్యక్తం చేయాల్సి వచ్చింది.
తనకు సంబంధం లేని అంశాలను పెద్దవిగా చేసి చూపుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతానని జగన్ పేర్కొన్నారు. దేవుడి దయ, ప్రజల దీవెనలు తనకు ఉన్నాయన్నారు. మొదటి నుంచి ప్రజలను, దేవుడిని నమ్మానని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ కామెంట్స్ ఉన్నాయి. తన కులం, మతం గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. అవి వింటుంటే బాధ కలుగుతోంది. నా మతం మానవత్వం..నా కులం మాట నిలబెట్టుకునే కులం అంటూ జగన్ స్పందించడం విశేషంగా మారింది. విపక్షాల వాదనలకు అడ్డుకట్ట వేసే యత్నంలోనే జగన్ వ్యాఖ్యలున్నాయని అంతా భావిస్తున్నారు. రాజకీయాలు, పాలనలో లోపాలు కాకుండా కులం, మతం కేంద్రంగా రాజకీయాలు చేయాలని చూస్తున్న వారికి కౌంటర్ గా సీఎం చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత పరిస్థితిలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.