ఏపీ రాజకీయాల్లో రాజధాని అంశం నలుగుతూనే ఉంది. చంద్రబాబు పాలనలో రాజధాని ఎంపిక నుంచి నిర్మాణంలో డిజైన్ల వరకూ నిత్యం వార్తల్లో అంశంగా ఉండేది. తాజాగా అసెంబ్లీ సమావేశాల ముగింపు దశలో జగన్ చేసిన ప్రకటన విస్తృత చర్చకు ఆస్కారం ఇచ్చింది. మూడు రాజధానుల ప్రతిపాదించడం ఆసక్తిగా మారింది.
అదే సమయంలో విపక్ష టీడీపీ గూటిలో దుమారం రేపుతోంది. ఆ పార్టీ నేతల్లో భిన్నస్వరాలు మొదలయ్యాయి. చంద్రబాబు ప్రకటనకు భిన్నంగా పలువురు మాట్లాడడం విశేషంగా మారుతోంది. ఈ జాబతాలో ఇప్పటికే గంటా శ్రీనివాసరావు చేరారు. మూడు రాజధానుల ప్రతిపాదనని ఆయన స్వాగతించారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని ట్వీట్ చేసారు. తద్వారా టీడీపీ అధికారిక ప్రకటనను ఆయన తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యల ప్రభావం పార్టీపై పడుతుందని భావిస్తున్నారు.
కర్నూల్ లో జ్యుడిషియల్ కేపిటల్ ప్రతిపాదనను కూడా రాయలసీమ తెలుగుదేశం నేతలు ఆహ్వానిస్తున్నారు. సీమ అభివృద్ధికి తోడ్పడుతుందని ఇప్పటికే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కె ఈ కుటుంబానికి చెందిన పలువురు కీలక నేతలు జగన్ ప్రకటనను స్వాగతించేందుకు సిద్దమవుతున్నారు. మూడు ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి ఈ ప్రతిపాదన ఉపయోగపడుతుందనే వాదన వినిపిస్తున్నారు.
జగన్ ప్రకటన ప్రభావం ప్రతిపక్ష టీడీపీ లో ప్రకంపనలు పుట్టించడం ఖాయమనే అభిప్రాయం బలపడుతోంది. అమరావతి ప్రాంత నేతలు, అక్కడ నేరుగా ప్రయోజనం పొందిన వారు మినహాయిస్తే మిగిలిన వారంతా జగన్ నిర్ణయానికి జై కొట్టేందుకు సన్నద్ధమవు తుండడంతో చివరకు బాబు కి మింగుడుపడని పరిణామాలు తప్పవని అంచనాలు వినిపిస్తాయి. చివరకు జనాభిప్రయనికి అనుగుణంగా చంద్రబాబు మళ్లీ యు టర్న్ తీసుకుంటారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఆర్థిక లబ్ధి తో ముడిపడిన అమరావతి విషయంలో అది అంత సులువు కాదనే వారు కూడా ఉన్నారు. ఏమైనా తలో దారిలో సాగుతున్న తమ్ముళ్ళ తీరుతో పార్టీకి, అధినేత కి చిక్కులు తప్పవని చెప్పక తప్పదు