iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ విచారణ సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పిటీషనర్ తో పాటు జగన్ తరుపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. సీబీఐ తరుపున కూడా వాదనలు వినిపించినప్పటికీ లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించేందుకు ససేమీరా అంటూ నిరాకరించింది. జగన్, రఘురామకృష్ణంరాజు తరుపు లాయర్లు మాత్రం లిఖితపూర్వక వాదనలు సమర్పించారు . బెయిల్ రద్దు విషయంలో కోర్టు నిర్ణయం తీసుకోవాలని సీబీఐ చెప్పడం ద్వారా జగన్ ప్రభావితం చేస్తున్నారనే అంశంలో ఆధారాలు లేవని అంగీకరించినట్టుగా న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
Also Read:రఘురామకృష్ణరాజు కూడా శరద్ యాదవ్ లాగే పదవిని కోల్పోతారా ?
వాస్తవానికి ముఖ్యమంత్రిగా జగన్ తన కేసుకి సంబంధించిన అంశాలను ప్రభావితం చేస్తున్నారన్నది రఘురామకృష్ణంరాజు ప్రధాన అభియోగం. కానీ దానికి సంబంధించిన ఆధారాలను ఆయన సమర్పించలేకపోయారు. దీనిపై సీబీఐ మాజీ జేడీ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీబీఐ కోర్టులో బెయిల్ రద్దు చేయాలని సాగుతున్న విచారణలో జగన్ కి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకపోవడం గమనించాలని లక్ష్మీనారాయణ అన్నారు. దాంతో ఈ పిటీషన్ జగన్ కి ఎటువంటి సమస్య తీసుకురాదనే అభిప్రాయం వెలిబుచ్చారు.
జగన్ అక్రమ ఆస్తులంటూ బనాయించిన కేసులో కూడా సీబీఐ విచారణ ముందుకు సాగడం లేదు. తన కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలని గతంలోనే జగన్ కోరినా అది నత్తనడకన ఉంది. దానికి ముఖ్యకారణం జగన్ మీద ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేకపోవడమేనన్నది పలువురి అభిప్రాయం. ఉండవల్లి వంటి వారు కూడా ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. జగన్ మీద కేసులు రాజకీయంగా ఉపయోగపడతాయే తప్ప చట్ట ప్రకారం చెల్లవని, వ్యాపారాలను ప్రభుత్వ కార్యకలాపాలతో ముడిపెట్టి చేసిన అభియోగాకు ఆధారాలే లేవని ఆయన బలంగా చెబుతూ వస్తున్నారు.
Also Read:కోమటిరెడ్డి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నాడా??
ప్రస్తుతం సీబీఐ కేసు విచారణలో పిటీషనర్ తో పాటుగా జగన్ తరుపున సమర్పించిన లిఖిత పూర్వక వాదనలపై విచారణ సాగబోతోంది. అయితే ఇక విచారణ ముగించి, తుది నిర్ణయానికి రావడానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి కోర్టు ఎలాంటి ప్రకటన చేస్తుందన్నది చర్చనీయాంశం.