Idream media
Idream media
తెలంగాణలో రాజకీయ పోరు ముదురుతోంది. ఎన్నికల వేళే కాదు.. సాధారణలో రోజుల్లోనూ ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడం గమనార్హం. పార్టీల కార్యక్రమాల సందర్భంగానో.. ప్రత్యేకంగా మీడియా సమావేశాలు పెట్టో మరీ తిట్టుకుంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గతంలో నల్గొండలో జరిగిన ఓ కార్యక్రమంలో నువ్వెంతా అంటే నువ్వెంత అని స్టేజీపైనే పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో దూషించుకున్న విషయం తెలిసిందే. తాజాగా జగదీశ్వర్ రెడ్డి మరోసారి ఉత్తమ్ పైనా, కాంగ్రెస్ పార్టీ చరిత్రపైనా కామెంట్లు చేయడం ఈ వివాదానికి దారితీసింది. జగదీశ్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. దీంతో జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాటల దాడికి దిగుతున్నారు.
తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానని, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్లే జగదీశ్‌రెడ్డి వంటి నేతలు మంత్రులయ్యారని జగ్గారెడ్డి అసెంబ్లీ మీడియాహాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తప్పు జరిగితే ముఖ్యమంత్రులను కూడా నిలదీసే అవకాశం ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార, ఉద్యోగ సంఘాలన్నీ డమ్మీలయ్యాయని అన్నారు. తెలంగాణ వచ్చాకా దోపిడీకి అంతే లేకుండా పోయిందన్నారు. మంత్రులు పోటీ పడి మరీ అవినీతికి పాల్పడుతూ ప్రజా ధనం కాజేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విస్కీలో సోడా కలిపే వాళ్లలే మంత్రి పదవులొచ్చాయన్నారు కరెంటు మంత్రి అయినా.. జగదీశ్‌రెడ్డి దగ్గర పవర్ లేదని ఎద్దేవా చేశారు. ‘‘నెహ్రూ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై ఆరోపణలు చేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి క్యారెక్టర్ ఏమిటో మాకు తెలుసు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. లేదంటే మేమూ ఆయన గురించి డబుల్, త్రిబుల్ మాట్లాడుతాం’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జగదీశ్‌రెడ్డి అవినీతిని బయటికి తీస్తాం’’ అని స్పష్టం చేశారు. ‘‘నెహ్రూపై సీబీఐ విచారణ చేయిస్తానంటావా? దేశ స్వాతంత్రం కోసం తన ఆస్తినే ధారాదత్తం చేసిన నెహ్రూ గురించి మాట్లాడేందుకు నీకేం అర్హత ఉంది? పైగా కేసీఆర్‌కు, నెహ్రూకు పొంతన పెడతావా? సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే అసలు ఎవరీ జగదీశ్‌రెడ్డి.. ఎక్కడ మంత్రి?’’ అని విరుచుకుపడ్డారు.
జగ్గారెడ్డిపై ఎమ్మెల్యేలు, ఎంపీల ఫైర్
తెలంగాణ ప్రజల ఉసురుతోనే కాంగ్రెస్ పార్టీ నాశనం అయిందని అంతకు ముందు మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. అవినీతికి ప్రత్యేక మ్యాప్ వేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రాజక్టుల డిజైన్ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపైన తెలంగాణ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క చుక్క మంచి నీరు కూడా ఇవ్వలేదన్నారు. జైలుకు వెళ్ళిన చరిత్ర కాంగ్రెస్ మంత్రులకు, నాయకులకు ఉందన్నారు. ప్రజల కోసం కట్టే ప్రాజక్టులను అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. తాజాగా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ స్పందించారు. దొంగ పాస్ పోర్టుల కేసులో చిప్పకూడు తిన్న జగ్గారెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డిని జగ్గారెడ్డి విమర్శించడం హాస్యాస్పదమని విమర్శించారు. ఉద్యోగాల కల్పనపై ఉత్తమ్, కోమటిరెడ్డి మాయమాటలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. నల్లగొండను నాశనం చేసినందుకే ప్రజలు ఓడించారనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ నేతలకు ఓ విజన్ లేదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. జగ్గారెడ్డికి సంస్కారం లేదు కాబట్టే టీఆర్ఎస్‌లో చేర్చుకోలేదని చిరుమర్తి తెలిపారు. గతంలో కాంగ్రెస్ సీఎంల అండతో జగ్గారెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పబ్లిసిటీ కోసమే జగదీష్‌రెడ్డిపై జగ్గారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే లింగయ్య విమర్శించారు. జగ్గారెడ్డి సంస్కార హీనుడని మరో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.