iDreamPost
android-app
ios-app

సీఎం హోదాలో ఎన్నికల గోదాలోకి యోగి -భయపెడుతున్న 50 ఏళ్ల నాటి ఫలితం

  • Published Jan 22, 2022 | 1:42 PM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
సీఎం హోదాలో ఎన్నికల గోదాలోకి యోగి -భయపెడుతున్న 50 ఏళ్ల నాటి ఫలితం

చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఉత్తరప్రదేశ్లో చట్టసభల ప్రతినిధులు కాకుండానే ఎక్కువమంది ఆ పదవి చేపట్టారు. సీఎం అయిన తర్వాత ఆరు నెలల్లోపు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావచ్చన్న వెసులుబాటును ఉపయోగించుకునేవారు. అంతెందుకు ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆయనకు ముందు అఖిలేష్ యాదవ్.. అంతకు ముందు మాయావతి కూడా సీఎం పదవి చేపట్టిన తర్వాతే ఎమ్మెల్సీలుగా ఎన్నికై లాంఛనం పూర్తి చేశారు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో తొలిసారి యోగి ఆదిత్యనాథ్ సాధారణ ఎన్నికల్లోనే గోరఖ్ పూర్ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. కానీ 50 ఏళ్ల క్రితం అదే గోరఖ్ పూర్ ప్రాంతం నుంచి సీఎం హోదాలోనే పోటీ చేసిన త్రిభువన్ నారైన్ సింగ్ ఓటమిపాలై ముఖ్యమంత్రి పదవినే కోల్పోవాల్సి వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు యోగి కూడా సీఎం హోదాలో అదే గోరఖ్ పూర్ ప్రాంతంలో పోటీ చేస్తుండటం బీజేపీ శ్రేణులను సెంటిమెంట్ పరంగా కలవరపెడుతోంది.

ఆనాడు ఏం జరిగిందంటే..

దేశంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం కొనసాగుతున్న కాలంలో తరచూ ముఖ్యమంత్రులను మార్చేసేది. కాంగ్రెస్ హవా తగ్గి జనతా, బీజేపీ తదితర పార్టీలు వచ్చినప్పటికీ పూర్తిస్థాయి బలం లేక సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడేవి. అవి కూడా తరచూ కూలిపోవడంతో, సీఎంలు కూడా మారిపోయేవారు. 1969లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించారు. 1970లో రాష్ట్రపతి పాలన ముగిసిన తర్వాత కాంగ్రెసేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది.

ముఖ్యమంత్రిగా త్రిభువన్ నారైన్ సింగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన యూపీ చట్టసభల్లో సభ్యుడు కారు. దాంతో ఆరు నెలల్లో ఎన్నికవ్వాల్సి వచ్చింది. అప్పట్లో గోరఖ్ పూర్ మణిరం నియోజకవర్గానికి ఇప్పటి సీఎం యోగి గురువు మహంత్ అవైద్యనాథ్ ఐదు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. సీఎం త్రిభువన్ కోసం ఆయన రాజీనామా చేశారు. దాంతో 1971లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం త్రిభువన్ ఓటమి పాలయ్యారు. పర్యవసానంగా సీఎం పదవిని కూడా కోల్పోయారు. ఆ తర్వాత గోరఖ్ పూర్ ప్రాంతం నుంచి ఏ సీఎం కూడా పోటీ చేయలేదు.

యోగికి గట్టి పట్టున్నా..

మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సీఎం హోదాలో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్  నియోజకవర్గం నుంచి పోటీకి నిలబడుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ద్వారా రెండోసారి సీఎం అవ్వాలని అనుకుంటున్నారు.వాస్తవానికి మొదట ఆయన్ను అయోధ్య లేదా మధుర నుంచి బరిలో దించాలని బీజేపీ అధిష్టానం భావించింది. అయితే యోగి పట్టుబట్టి గోరఖ్ పూర్ ఖరారు చేయించుకున్నారు.

గోరఖ్ పూర్ ఆయన సొంత ప్రాంతం. గట్టి పట్టు ఉంది. ఇక్కడి నుంచే ఐదుసార్లు ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ గతంలో ముఖ్యమంత్రే ఇక్కడ ఓడిపోయిన ఘటన సెంటిమెంట్ పరంగా బీజేపీ కార్యకర్తలను కలవరపెడుతోంది. అప్పటి ఫలితం రిపీట్ అవుతుందేమోనన్న అనుమానం వెంటాడుతోంది. అదే జరిగితే సీఎం హోదాలో ఓడిపోయిన రెండో నేతగా యోగి నిలుస్తారు. గెలిస్తే గోరఖ్ పూర్ నుంచి గెలిచిన తొలి సీఎం అవుతారు. ఏది జరిగినా రికార్డే.