కొద్దిరోజుల క్రితం నితిన్ చెక్ విడుదలను ముందు ప్రకటించిన ఫిబ్రవరి 19 కాకుండా ట్రైలర్ లో 26కి పోస్ట్ పోన్ అయినట్టు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ రోజు పొగరు, చక్ర రెండు డబ్బింగ్ సినిమాలు తప్ప పెద్దగా కాంపిటీషన్ లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారాని అభిమానులు సైతం షాక్ అయ్యారు. అయితే దీని వెనుక చాలా ప్లాన్డ్ గా వేసుకున్న స్ట్రాటజీ కనిపిస్తోంది. 12న ఉప్పెన రాబోతోంది. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమానే అయినప్పటికీ ఇతరత్రా కారణాల వల్ల దీని మీద విపరీతమైన హైప్ వచ్చేసింది. యావరేజ్ గా ఉన్నా చాలు వసూళ్ల సునామి ఖాయంగా కనిపిస్తోంది.
దీనికి తోడు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవితో సహా అందరూ చాలా పాజిటివ్ గా దీని గురించి మాట్లాడారు. ఇది అన్ని సినిమా ఫంక్షన్లలో సాధారణమే అయినప్పటికీ ఉప్పెన విషయంలో మాత్రం ముందు నుంచి చాలా సానుకూల వాతావరణం కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, విజయ్ సేతుపతి విలనీ, వైష్ణవ్-కృతిల జంట, సముద్ర నేపధ్యంలో స్టోరీ ఈ సెటప్ అంతా యూత్ లో చాలా బజ్ తీసుకొచ్చింది. మెగా ఫ్యాన్స్ అండ ఎలాగూ ఉండనే ఉంది. టాక్ కొంచెం బాగుందని వచ్చినా చాలు బాక్సాఫీస్ వద్ద ఉప్పెన దూసుకుపోవడం ఖాయం. అందులోనూ క్రాక్ తర్వాత టాలీవుడ్ కు సరైన సినిమా పడలేదు.
ఇదంతా ముందే ఊహించిన చెక్ టీమ్ చాలా తెలివిగా తమ డేట్ ని 19 నుంచి 26కు షిఫ్ట్ చేసుకుంది. ఒకవేళ ఉప్పెన కనక బ్లాక్ బస్టర్ అయితే కనీసం రెండు వారాలు తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది. ఏదైనా తేడా వస్తే అది తర్వాత సంగతి. అందుకే చెక్ వదిలేసిన తేదీని అల్లరి నరేష్ నాంది కోసం తీసుకున్నారు. ఇది సీరియస్ సబ్జెక్టు కాబట్టి ఉప్పెన ప్రభావం గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇక చక్ర, పొగరులు ఒరిజినల్ వెర్షన్ డేట్లకు అనుగుణంగా వస్తున్నవే తప్ప పోటీ కోసమని కాదు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన చెక్ లో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.