iDreamPost
android-app
ios-app

సెకెండ్‌ వేవ్‌ తప్పదా..?

  • Published Oct 16, 2020 | 12:08 PM Updated Updated Oct 16, 2020 | 12:08 PM
సెకెండ్‌ వేవ్‌ తప్పదా..?

కోవిడ్‌ 19 మహ్మారి జనంపై కక్షగట్టి ఆరునెలలు దాటిపోయింది. ఇప్పటిక్కూడా దాని కక్ష తీరడం లేదు. కాస్త నెమ్మదిస్తున్నట్టు కన్పిస్తున్నప్పటికీ తనపనిలో తానుంటోంది. దీంతో గతంలోకంటే సగానికి సగం తగ్గినప్పటికీ పాజిటివ్‌లు మాత్రం నమోదవుతూనే ఉంటున్నాయి.

ఇదిలా ఉండగా నిపుణులు ముందనుంచే హెచ్చరిస్తున్న సెకెండ్‌ వేవ్‌ అనేది భారత్‌కు పొంచి ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అన్‌లాక్‌ 5.0 సడలింపుల ద్వారా భారీ జనసమూహ సమీకరణలు మినహా మిగిలినవన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయి. సాధారణ రోజులకు మాదిరిగానే జనజీవనం కూడా కన్పిస్తోంది. అయితే లండన్, ఫ్రాన్స్‌ వంటి నగరాల్లో ఇప్పుడు కరోనా సెకెండ్‌ వేవ్‌ కారణంగా పెద్ద ఎత్తున పాజిటివ్‌లు బైటపడడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడ కూడా గతంలో లాక్డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసారు. దీంతో జనజీవనం సాధారణ పరిస్థితులకు మారింది. హఠాత్తుగా పాజటివ్‌ భారిన పడ్డవారి సంఖ్య ఇప్పుడు అనూహ్యంగా పెరిగిపోవడంతో ఆ మహానగరాల్లో పాక్షిక ఆంక్షల ద్వారా లాక్డౌన్‌కు తిరిగి వెళ్ళినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

అదే పరిస్థితి మనదేశంలో కూడా ఎదురైతే పరిస్థితి ఏంటన్న ఆందోళనలు ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి. లాక్డౌన్‌ నిబంధనలు అమలు చేసినప్పటికీ మనదేశంలో దాదాపు 73లక్షలకుపైగా పాజిటివ్‌లు గుర్తించారు. లక్షకుపైగా జనం మృత్యువాత పడ్డారు. ఒక దశలో ఐసీయూ దశకు చేరిన రోగుల ప్రాణాలు కాపాడడానికే ప్రాధ్యాన్యం ఇవ్వాల్సిందేమో అన్నంత స్థాయిలో వైద్యరంగంపై ఒత్తిడి పెరిగిపోయింది.

అయితే క్రమేపీ పాజిటివ్‌ల సంఖ్య తగ్గుతుండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక వేళ సెకెండ్‌వేవ్‌లో మళ్ళీ కేసులు పెరిగేలాంటి పరిస్థితులే ఎదురైతే అనుసరించాల్సిన మార్గం గురించి ఇప్పుడే సిద్ధపడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా కోవిడ్‌ ఆఫ్టర్‌ లక్షణాలతో పలువురు తిరిగి ఆసుపత్రుల్లో చేరుతున్న సంఘటనలు కూడా అక్కడక్కడా నమోదవుతున్నాయి. అయితే ఇది ఎంత శాతం మందికి అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు.

ఏపీలో ప్రభుత్వం విస్తృత చర్యల ద్వారా కోవిడ్‌ రోగులను ట్రేస్‌ చేయడంతో పాటు, కోవిడ్‌ ఆఫ్టర్‌ లక్షణాలను గుర్తించేందుకు కూడా ఇంటింటా సర్వేలకు తమ వైద్య సిబ్బంది విస్తృతంగా వినియోగిస్తుండడం శుభపరిణామంగా చెబుతున్నారు. తద్వారా ప్రమాదం భారిన పడేవారి సంఖ్యను గణనీయంగా తగ్గించుకునేందుకు వీలవుతుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో వ్యక్తిగతంగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నారు నిపుణులు. మాస్కు, భౌతికదూరం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేవి అల్టిమేట్‌ రక్షణాస్త్రాలంటున్నారు. సక్రమంగా వీటిని అమలుచేయడం ద్వారా తమని తాము కాపాడుకోవడంతో పాటు, జన సమూహాలను కూడా కాపాడవచ్చుని హితవు పలుకుతున్నారు.