iDreamPost
android-app
ios-app

కెన్నెడీ వంశాన్ని వెంటాడిన శాపం

కెన్నెడీ వంశాన్ని వెంటాడిన శాపం

నవంబరు 22, 1963న అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నెడీ హత్యతో అమెరికా యావత్తు దుఃఖంలో మునిగిపోయింది. ఛరిస్మా, ప్రజాదరణ కలిగిన యువ అధ్యక్షుడు దుర్మరణం పాలవడం అమెరికన్లను కలచివేసింది. డల్లాస్ నగరంలో తన సతీమణి జాక్వెలీన్, టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ జాన్ కొన్నాలీ దంపతులతో కలిసి ఓపెన్ టాప్ కారులో రోడ్డుకిరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తుండగా ఒక భవనం ఆరవ అంతస్తు నుంచి లీ హార్వే ఓస్వాల్డ్ అనే మాజీ సైనికుడు తుపాకీతో కాల్చి చంపాడు కెన్నెడీని.

ఆ హంతకుడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ అనంతరం రెండు రోజుల తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి జైలుకి తరలిస్తుండగా జాక్ రూబీ అనే వ్యక్తి అతడిని కాల్చి చంపాడు. కెన్నెడీని చంపాడన్న కోపంతోనే ఓస్వాల్డుని చంపానన్న రూబీ వాదన కోర్టు అంగీకరించకుండా రూబీకి ఉరిశిక్ష విధిస్తే, దాని మీద రూబీ చేసుకున్న అప్పీలు విచారణ సమయంలో లంగ్ కేన్సరుతో అతను మరణించాడు. ఈ హత్య మీద 1964లో విచారణ జరిపిన వారెన్ కమీషన్ ఓస్వాల్డ్, రూబీల వెనక కుట్ర కోణం లేదని తేలిస్తే, 1978లో తిరిగి విచారణ జరిపిన హౌస్ సెలక్ట్ కమిటీ కుట్ర ఉందని నిర్ధారణ చేసినా నిందితులు ఇద్దరూ మరణించడంతో విచారణ ముందుకు సాగకపోవడంతో కేసు మూసివేశారు.

కెన్నెడీల కుటుంబంలో వరుస దుర్ఘటనలు

కెన్నెడీల కుటుంబంలో అధ్యక్షుడు కెన్నెడీ హత్య ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించినా, వారి కుటుంబంలో ఇది మొదటిది కానీ, చివరిది కానీ కాదు. కెన్నెడీ కుటుంబం పంతొమ్మిదవ శతాబ్దంలో ఐర్లాండ్ నుంచి అమెరికాకు వలస వచ్చిన తర్వాత రెండో తరానికి చెందిన జోసెఫ్ కెన్నెడీ స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించి, డెమోక్రటిక్ పార్టీ తరఫున వివిధ కమిటీల ఛైర్మన్ గా, ఇంగ్లాండు రాయబారిగా పనిచేశాడు. తన వారసుడిగా తన పెద్ద కుమారుడు జోసెఫ్ కెన్నెడీ జూనియర్ ని తీర్చిదిద్ది, కాబోయే అమెరికా అధ్యక్షుడు అని దగ్గర వారితో చెప్తూ ఉండేవాడు.

తండ్రి ఆశలకు తగ్గట్టుగా చదువులో, క్రీడల్లో రాణిస్తూ, రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో సైన్యంలో చేరాడు జూనియర్ జోసెఫ్. యుద్ధ విమానంలో నుంచి రేడియోతో కంట్రోల్ చేసే బాంబులతో ప్రత్యర్థి స్థావరాలను ధ్వంసం చేసే క్రమంలో తన విమానంలోనే బాంబు పేలి, తన కో పైలట్ సహా ఆగస్టు 12,1944 న మరణించాడు జోసెఫ్ జూనియర్. ఇతని సోదరి కేథలీన్ కెన్నెడీ మే13, 1948న ఫ్రాన్స్ లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది.

జోసెఫ్ జూనియర్ మరో సోదరి రోస్ మేరీ చిన్నప్పటినుంచి మానసిక సమస్యతో బాధ పడేది. ఉన్నట్టుండి పిచ్చి కోపం తెచ్చుకుని ఎవరు కనిపిస్తే వారిని తిట్టడం, కొట్టడం చేస్తూ ఉండేది. కుమార్తె సమస్య తన కుమారుడు అధ్యక్షుడు కావడానికి ఇబ్బందిగా తయారవుతుందేమో అని చాలా మంది వైద్యులకు చూపించాడు సీనియర్ జోసెఫ్ కెన్నెడీ. అప్పుడే ప్రయోగాత్మకంగా చేస్తున్న లోబోటమీ ఆపరేషన్ గురించి కొందరు చెప్పగా ఆ ఆపరేషన్ చేయించాడు. మెదడులో కొంతభాగం తీసివేసే ఈ ఆపరేషన్ తరువాత రోస్ మేరీ పరిస్థితి మరీ ఆధ్వాన్నంగా తయారయింది. తన సొంత పనులకు కూడా మరొకరి మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈమె తన ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఒక శరణాలయంలో 2005లో మరణించింది.

రాబర్ట్ కెన్నెడీ హత్య

1963లో జాన్ కెన్నెడీ హత్య తర్వాత అతని సోదరుడు రాబర్ట్ కెన్నెడీ తన కుటుంబం తరఫున రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. న్యూయార్క్ నగరం నుంచి సెనేటర్ గా ఎన్నికయి, డెమోక్రాట్స్ తరఫున అధ్యక్ష పదవికి నామినేషన్ పొందే ప్రయత్నం చేస్తుండగా జూన్ 5,1968న హత్యకు గురయ్యాడు.

జులై 18,1969న మరో సోదరుడు ఎడ్వర్డ్ కెన్నెడీ నడుపుతున్న కారు మసాచుసెట్స్ నగరంలో బ్రిడ్జి మీద నుంచి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఎడ్వర్డ్ ప్రాణాలతో బయటపడ్డా, అతనితో పాటు కారులో ఉన్న మేరీ అనే అమ్మాయి మరణించింది. ఈ సంఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ “మా కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతూ ఉంది” అన్నాడు అతను. అప్పటి నుంచి “కెన్నెడీ కర్స్ (Kennedy Curse” ప్రచారంలోకి వచ్చింది.

రాబర్ట్ కెన్నెడీ హత్య తర్వాత అతని కుమారుడు డేవిడ్ కెన్నెడీ మాదకద్రవ్యాలకు బానిసగా మారి, అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏప్రిల్ 25,1984న మరణించాడు. ఇతని సోదరుడు మైఖేల్ కెన్నెడీ డిసెంబర్ 31,1997న ఫ్రాన్స్ లోని ఆల్ప్స్ పర్వతం మీద మంచులో స్కీయింగ్ చేస్తూ ప్రమాదంలో మరణించాడు. జాన్ కెన్నెడీ కుమారుడు జాన్ కెన్నెడీ జూనియర్ నడుపుతున్న విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి జూన్ 26,1999న మరణించాడు.

ఇవన్నీ చూస్తే కెన్నెడీ కర్స్ నిజంగా ఆ కుటుంబాన్ని వేధిస్తూ ఉందేమో అని ఎవరికైనా అనిపిస్తుంది.