సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి దాదాపు పదిహేనేళ్లు కావస్తున్నా ఇప్పటికీ వెండితెరపై కథానాయిక పాత్రల్లో తళుకులీనుతున్న ఘనత శ్రియది. కాగా ఈ భామ.. ఓ విదేశీ యువకుడిని ప్రేమ వివాహం చేసుకోబోతోందంటూ కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇదే విషయంపై ఇటీవల మీడియా సిబ్బంది డైరెక్టుగా శ్రియను అడిగితే..‘మైండ్ యువర్ బిజినెస్’ అంటూ కాస్త ఘాటుగానే సమాధానమిచ్చింది. కాగా ఆమె ప్రతిస్పందన ఎలా ఉన్నాఈ అంశంపై రూమర్లు మాత్రం ఆగడం లేదు. శ్రియ..రష్యాకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉందని, ఈ మార్చిలో రాజస్థాన్‌లో శ్రియ వివాహం జరగనుందని వదంతులు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.
కాగా గత ఏడాది బాలకృష్ణ సరసన గౌతమీపుత్ర శాతకర్ణి వంటి విజయవంతమైన చిత్రంలో జతకట్టిన శ్రియ.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం విశేషం. ఆమె కీలక పాత్రలో నటించిన ‘గాయత్రి’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ఇదే కాకుండా తమిళంలో ‘నరగసూరన్’, హిందీలో ‘తడ్కా’, తెలుగులో ‘వీర భోగ వసంతరాయులు’ చిత్రాల్లోను శ్రియ నటిస్తోంది. కాగా గతంలో దక్షిణాదిన టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొదిన ఇలియానా కూడా ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌ను ప్రేమించి పెళ్లాడినట్టు ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.