iDreamPost
android-app
ios-app

రామోజీ సంస్థల్లో కీలక పరిణామాలు, ఆర్థిక పరిస్థితిపై సందేహాలు

  • Published Jun 27, 2020 | 11:51 AM Updated Updated Jun 27, 2020 | 11:51 AM
రామోజీ సంస్థల్లో కీలక పరిణామాలు,  ఆర్థిక పరిస్థితిపై సందేహాలు

తెలుగునేలపై సర్క్యులేషన్ లో నెంబర్ వన్ పత్రిక ఇప్పుడు దిక్కులు చూస్తోంది. సిబ్బందికి చుక్కలు చూపిస్తోంది. అదే సమయంలో రామోజీ రావు కి చెందిన ఫిల్మ్ సిటీ ఇప్పుడు చేతులు మారేందుకు సన్నద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీ ఇప్పటికే అద్దెకి ఇవ్వడం ద్వారా అందుకు అడుగులు పడినట్టు కనిపిస్తోంది. దానికి ముందు ఈటీవీ చానెళ్లు రిలయెన్స్ చేతుల్లోకి మళ్లాయి. ఈనాడులో కూడా గుర్తించ దగ్గ స్థాయిలో వాటా రిలయెన్స్ దక్కించుకుంది. ఇక ఈటీవీ భారత్ అంటూ ప్రారంభించిన ప్రాజెక్ట్ కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దాంతో ఇప్పటికీ దానిని అధికారికంగా ప్రారంభించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో రామోజీరావుకి చెందిన సంస్థల్లో సాగుతున్న పరిణామాలు చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. తెలుగు మీడియా రంగంలో తిరుగులేని శక్తిగా ఉన్న వ్యవస్థ నీరుగారిపోయే దిశలో ఉందా అనే సందేహాలు పెరుగుతున్నాయి.

చెరుకూరి రామోజీరావు ఎక్కడ చేయి వేస్తే అది సక్సెస్ ఫుల్ అవుతుందనే అభిప్రాయం ఉంది. అందుకు అనుగుణంగానే చాలా చోట్ల ఆయన సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. కానీ గడిచిన కొన్నేళ్లుగా పరిస్థితి తలకిందులవుతున్న సంకేతాలు వస్తున్నాయి. మార్గదర్శితో మొదలయిన ఇలాంటి సమస్యలు ఇటీవల తీవ్రం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈటీవీ కి చెందిన వివిధ భాషల్లోని చానెళ్లను రిలయెన్స్ గ్రూప్ కి అప్పగించేశారు. ముఖేష్‌ అంబానీ కి చెందిన న్యూస్ 18 ఆధ్వర్యంలో ఆయా చానెళ్లు మళ్లాయి. ఆ తర్వాత ఈనాడులో కూడా ఓ పెద్ద భాగం వాటాని రిలయెన్స్ కి కట్టబెట్టడం కూడా ఆసక్తికరమే. గతంలో మార్గదర్శి విషయంలో ఆదుకున్నందుకు టీవీ చానెళ్లు అప్పగించారని అంతా భావించినప్పటికీ తాజాగా ఈనాడులో కూడా వాటా అప్పగించడం ఆశ్చర్యం కలిగించింది. ఇటీవల ఈనాడు సంస్థల్లో సిబ్బంది కుదింపు పెద్ద స్థాయిలో సాగుతోంది. దానికి రామోజీ మార్క్ వ్యూహాలు అనుసరిస్తున్నారు. సిబ్బందిని పొమ్మన కుండా పొగబెట్టే పద్ధతి పాటిస్తున్నారు. సగం మంది సిబ్బందిని తీసేస్తారని ప్రచారం సాగినప్పటికీ అందరికీ పని కల్పిస్తూ నెలలో సగం రోజులూ పని కల్పించే పద్ధతిని ప్రవేశపెట్టడం మీడియా వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎన్నో ఏళ్లపాటు లాభాలు గడించిన సంస్థ రెండు నెలల లాక్ డౌన్ కే ఇలా సిబ్బందిని తొలగించే ప్రయత్నానికి పూనుకోవడం సందేహాలకు తావిచ్చింది.

ఇక ఆ తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఈటీవీ భారత్ విఫలం కావడం రామోజీరావుని కలచివేసింది. చివరకు దానిని అత్యంత ఆడంబరంగా ప్రారంభించాలని భావించినప్పటికీ అలాంటి కార్యక్రమే ఇప్పటి వరకూ నిర్వహించలేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈటీవీ భారత్ విజయవంతం కాలేదనే అభిప్రాయం బలపడుతోంది. దాంతో పాటు తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీని కూడా అద్దెకు అప్పగించడం మరో సంచలనంగా మారుతోంది. ఫిల్మ్ సిటీ లోనే వివిధ సంస్థలు నడుపుతున్న రామోజీరావుకి ఇప్పుడు ఫిల్మ్ సిటీని అద్దెకిచ్చిన తర్వాత ఆయా సంస్థల నిర్వహణ అనుమానాలకు అవకాశం ఇస్తోంది. అదే సమయంలో ఈటీవీ సీరియళ్ళ షూటింగుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏమయినా మొత్తంగా ఇన్నాళ్లుగా ఎంతో సాఫీగా సాగిన రామోజీ పయనంలో తుది అంకంలో ఎదురవుతున్న సవాళ్లు ఆసక్తికరమేనని చెప్పవచ్చు. అనేక ఆటంకాలు అధిగమించి ఎదిగిన రామోజీరావు ఇప్పుడు ఎదురవుతున్న ఛాలెంజ్ ని ఎలా అధిగమిస్తారో చూడాలి.