iDreamPost
android-app
ios-app

నివేదిత అలక వీడినట్లేనా ?పార్టీ మార్పు ఆగిపోయినట్లేనా ?

నివేదిత అలక వీడినట్లేనా ?పార్టీ మార్పు ఆగిపోయినట్లేనా ?

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో అభ్యర్థులతో పాటు బీజేపీ నుంచి టికెట్‌ ఆశించిన నివేదితా రెడ్డిపై తొలి నుంచీ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నియోజకవర్గం ఇన్‌చార్జి కావడం, గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉండడంతో తనకే టికెట్‌ వస్తుందని బలంగా నమ్మారు. ప్రచార రథాలను కూడా సిద్ధం చేసుకున్నారు. అంతేకాదు, తన పేరుపై ఎన్నికలకు అనువుగా పాటలూ రాయించుకున్నారు. కానీ టికెట్‌ రాకపోవడంతో షాక్‌ అయ్యారు. ఆమెతో పాటు బీజేపీ టికెట్‌ ఆశించిన కడారి అంజయ్యయాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. నివేదితా రెడ్డి తో కూడా టీఆర్‌ఎస్‌ నేతలు సంప్రదింపులు జరిపారు. కానీ బీజేపీ రెబల్‌గా పోటీలో కొనసాగుతానని ఆమె ప్రకటించారు. అయితే, ఆమె నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో నివేదితా రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారనేది రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.

గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి అనంతరం నాగార్జునసాగర్‌ బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కంకణాల నివేదిత రెడ్డి కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నోముల నర్సింహ్మయ్య ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మరోసారి పోటీకి ఆమె అన్ని రకాలుగానూ సిద్ధమయ్యారు. అందరి కంటే ముందుగానే ప్రచారం మొదలు పెట్టేశారు. అధిష్ఠానం ఖరారు చేయకుండానే బీజేపీ తరఫున నామినేషన్‌ కూడా వేసేశారు. ఓ వైపు బీజేపీ తన అభ్యర్థి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండగానే నివేదిత నామినేషన్‌ వేయడం అప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

నివేదితారెడ్డి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసినప్పటికీ నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయ్యే సమయానికి బీ ఫాం సమర్పించకపోవడంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. అధిష్ఠానం తన పేరే ఖరారు చేస్తుందన్న నమ్మకంతో ఆమె మార్చి 26వ తేదీన నామినేషన్‌ వేశారు. మార్చి 29వ తేదీన పార్టీ రవినాయక్‌ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో ఆమెకు టికెట్‌ దక్కలేదు. దీంతో బీజేపీ రెబల్‌ అభ్యర్థిగా పోటీలో ఉంటానని ఆమె ప్రకటించారు. నామినేషన్‌ సమయంలో ఆమె పేరును ప్రతిపాదిస్తూ 10 మంది సంతకాలు చేస్తే ఆమెను ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా అయినా గుర్తించేవారు. కానీ పత్రాలపై ఒక్కరే సంతకాలు చేశారు. దీంతో ఆమె నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. పోటీ చేసే అవకాశమే లేకుండా పోయింది.

ఉప ఎన్నికలో గెలిచేందుకు ఏ చిన్న అవకాశం కలిసి వస్తుందని భావిస్తున్నా దాన్ని దక్కించుకోవడానికి పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీపై గుర్రుగా ఉన్న నివేదితా రెడ్డిని తమలో కలుపుకునేందుకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థి ప్రకటన వెంటనే టీఆర్‌ఎస్‌ చర్చలు జరిపినా తాను పోటీలో ఉంటానని తెలపడంతో అవి ఫలించలేదు. ఇప్పుడు మరోసారి టీఆర్‌ఎస్‌ పెద్దలు ఆమెతో మాట్లాడారు. ప్రచారంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థితో కలిసి రావాలని కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నాయకులు కూడా నివేదితా రెడ్డితో మాట్లాడినట్లు తెలుస్తోంది. నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యాక నివేదిత స్తబ్ధుగా ఉన్నారు. ఇప్పుడు ఆయా పార్టీలు సంప్రదిస్తుండడంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. నివేదితా రెడ్డి భర్త శ్రీధర్‌ రెడ్డి ప్రస్తుతం నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కూడా బీజేపీలోనే కొనసాగుతారా? లేదా? అనేది వేచి చూడాలి.