iDreamPost
iDreamPost
పార్టీల జెండాలు.. సిద్ధాంతాలు పక్కనబెట్టి అధికారమే పరమావధిగా ఎన్నికల్లో పెట్టుకున్న పొత్తులు ఫలిస్తాయా? ఎవరికి వారే అంటూ ఒకరి ప్రయోజనాల కోసం మరొకరు అన్నట్టుగా ఉండే టీడీపీ, జనసేన కూటమి కట్టగా.. ఆ పంచన ఉప్పు..నిప్పుగా కొట్టుకునే కాషాయం.. కమ్యూనిస్టులు చేరడం వల్ల ఆశించిన ఎన్నికల ఫలితం దక్కుతుందా? పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీని ఓడిరచేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమై మహాకూటమిగా ఏర్పడింది. అధికారమే అజెండాగా పార్టీలన్నీ తమ జెండాలను వదిలి సీట్లు పంచుకున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి మహా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో 20 వార్డులకు గాను టీడీపీ 13 వార్డుల్లో పోటీ చేసింది. జనసేన 5, సీపీఎం 2, బీజేపీ మద్దతుతో ఒకరు చొప్పున పోటీ పడ్డారు. 14 వార్డులో మాత్రమే టీడీపీ, సీపీఎం అభ్యర్థులు ఉన్నారు. పార్టీ అధినాయకత్వం పొత్తులు లేవని చెబుతున్నా స్థానికంగా పొత్తులు పెట్టుకున్నారు. అన్నిపార్టీలు కలిసి ఉమ్మడిగా నిలిపిన అభ్యర్థులను గెలపించేందుకు అహర్నిశలు కృషి చేశారు. గత సాధారణ ఎన్నికల్లో ఉండి నుంచి టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు) విజయం సాధించారు. దీనితో ఎట్టి పరిస్థితుల్లో ఆకివీడు నగర పంచాయతీ గెలవాలని స్థానిక ఎమ్మెల్యే రాంబాబు పట్టుదలతో ఉన్నారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసి గెలవడం అసాధ్యమని గుర్తించిన ఎమ్మెల్యే ఈ పొత్తులకు తెరదీశారు. పొత్తులు తగినట్టుగానే ఆయా వార్డుల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. గెలుపు ఆశలు ఉన్న వార్డుల్లో అంచనాలు మించి సొమ్ములు ఖర్చు చేశారు.
ఓటింగ్ సరళి చూస్తుంటే మహాకూటమి గెలుపుపై ఆయా పార్టీల క్యాడర్‌కే నమ్మకం కలగడం లేదు. ఇక్కడ మొత్తం 20 వార్డులకు గాను 26 వేల 285 (79.74 శాతం) మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మహా కూటమి పొత్తు వల్ల ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చామని, అధికారపార్టీతో సమానంగా సీట్లు సాధిస్తామంటూ ఆయా పార్టీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారే తప్ప మెజార్టీ సాధిస్తామని నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. కనీసం పది వార్డులు కైవసం చేసుకుంటామనే అంచనాలతో ఉన్నారు. మరోవైపు అధికార వైఎస్సార్‌సీపీ నేతలు గెలుపు ఏకపక్షం అనే ధీమాతో ఉన్నారు. మహా కూటమిగా ఏర్పడడం వల్ల కొన్ని వార్డులల్లో గట్టి పోటీ ఉన్నా 14 సీట్లు వస్తాయని లెక్కలు కడుతున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలతోపాటు, పార్టీ శ్రేణులంతా ఏకతాటి మీదకు వచ్చి పనిచేయడం, మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయడంతో గెలుపు సులువైందని వారు అంచనాలతో ఉన్నారు. ఎవరి అంచనాలు వారికున్నా బుధవారం ఎన్నికల ఫలితాల కోసం స్థానికులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
Also Read : Political Alliance, Akividu Muncipality – ఇవేం పొత్తులు..?