రాజకీయనేతగా, పారిశ్రామికవేత్తగా తెలుగు ప్రజలకు లగడపాటి రాజగోపాల్ సుపరిచితులు. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయనను టీఆర్ఎస్ నేతలు జగడపాటి అని పిలిచేవారు. సమైక్యవాదిగా, సర్వేలతో తెలుగు రాష్ట్రాల్లో పాపులరైన లగడపాటి, లోక్ సభలో పెప్పర్ స్ప్రై వాడి దేశవ్యాప్తంగా మార్మోగారు. విజయవాడ పార్లమెంట్ స్థానంలో మంచిపట్టున్న లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో వ్యాపారాలు చేసుకుంటూ ఆకేషనల్లీ విజయవాడకు వస్తున్నారు.
మాట కోసం.. రాజకీయాలకు దూరం…
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజకీయాలు వదిలేస్తున్నట్లు ప్రకటించిన రాజగోపాల్.. ఇచ్చిన మాట మేరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన వ్యాపారాలు చూసుకుంటూ అప్పుడప్పుడు విజయవాడకు వస్తున్నారు. అయితే రాజగోపాల్ రాజకీయాల్లో లేకున్నప్పటికీ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఆయన అనుచరులు పలు పార్టీల్లో క్రీయశీలకంగా ఉన్నారు. ప్రజలతో పాటు రాజకీయ పార్టీల అధినేతలు కూడా లగడపాటి మళ్లీ పాలిటిక్స్ లోకి రావాలని ఆశించారు.
ఏం మాటిచ్చారు.. ఎందుకిచ్చారు…
విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో రాజగోపాల్, సమకాలీన రాజకీయ పరిణామాలపై మీడియాలో స్పందించే వారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై మీడియా ఛానళ్లలో ప్రతిరోజూ చర్చ జరిగేది. ఆ చర్చల్లో ప్రత్యేక తెలంగాణ వాదులతో పాటు సమైక్యవాదాలు, తటస్థులు, మేధావులు పాల్గొనే వారు. అలా రాజగోపాల్ కూడా ఓ చర్చలో పాల్గొని సమైక్యవాదాన్నిగట్టిగా వినిపిస్తుండగా టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు కౌంటర్ చేశారు. ఆంధ్రాలో అత్యున్నత పదవి ఆశించి భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని రాజగోపాల్ పై హరీశ్ ఆరోపించారు. అందుకు సమాధానంగా మాట్లాడిన రాజగోపాల్ …‘ బావోద్వేగలపై రాజకీయ పునాది నిర్మించుకోవడం ఇష్టం లేదని’ రాష్ట్రం విడిపోతే రాజకీయాలకు గుడ్ బై చెబుతానన్నారు. అలా మీడియాలో ఆ బైట్ హైలెట్ కావడంతో రాజగోపాల్ ఆ మాటకు కట్టుబడి ఎంతో మక్కువతో వచ్చిన రాజకీయరంగం నుంచి దూరమయ్యారు.
Also Read : టీడీపీకి మాజీమంత్రి రాజీనామా
విద్యార్థి నేతగా కోట్లాట..
విజయవాడ సిద్ధార్థ కాలేజీ నుంచి ఇంజినీరింగ్ లో పట్టభద్రుడైన రాజగోపాల్.. చదువు తర్వాత 17 ఏళ్ల పాటు వ్యాపారం చేశారు. ఆ తర్వాత రాజకీయాలపై మక్కువతో కాంగ్రెస్ లో చేరారు. కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర అల్లుడైన రాజగోపాల్ వైఎస్సార్ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు, తొలినాళ్లలో షెడ్యూల్ చూసేవారు. వైఎస్ తో పాటు ఆయన కూడా 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
కాంగ్రెస్ తో పయనం..
ప్రత్యక్ష ఎన్నికల్లోకి రాక ముందు మామ ఉపేంద్ర ఎన్నికల వ్యవహారాలను చూసేశారు. 2003 ఫిబ్రవరి 6న కాంగ్రెస్ లో చేరిన లగడపాటి రాజగోపాల్.. ఏలూరు నుంచి పోటీ చేయాలని అనుకున్నప్పటికీ, కుటుంబ సభ్యలు ఒత్తిడి మేరకు విజయవాడ నుంచి పోటీ చేశారు. 2004 లో టీడీపీ అభ్యర్థి, సినీ నిర్మాత అశ్వినీదత్ పై విజయం సాధించి లోక్ సభలో అడుగుపెట్టారు. 2009లో మళ్లీ టీడీపీ పై విజయం సాధించారు. అయితే అప్పుడు అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్. రెండు ఎన్నికల్లోనూ ప్రత్యర్థులు ఆయన సామాజికవర్గానికి చెందిన కమ్మ వారే కావడం విశేషం. విజయవాడ లోక్ సభ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది కూడా కమ్మవారే.
Also Read : జలగం వెంగళరావు కుటుంబం రాజకీయంగా ఏమి చేస్తుంది ?
రాజకీయాలపై మక్కువతో పాటు ఫీల్డ్ లెవల్ లో పార్టీ పట్టును అంచనా వేయడంలో ఆయన నేర్పరి. అలాగే ప్రత్యర్థులకు దీటుగా వ్యూహాలు రచించి విజయం సాధించడంలో కూడా దిట్ట. ఎంపీగా ఉన్నప్పుడు క్యాడర్ తో మంచి సంబంధాలు మెయింటన్ చేసిన రాజగోపాల్ …ఇప్పటికీ వారితో టచ్ లోనే ఉన్నారని టాక్ ఉంది.
లోక్ సభలో పెప్పర్ స్ప్రే…
టీవీ చర్చలతో పాటు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా రాష్ట్రాన్ని విభజించవద్దని వాదించిన రాజగోపాల్.. లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ సమయంలో ఆంధ్రా ఎంపీలందరూ బిల్లును వ్యతిరేకించారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, రాజగోపాల్ తెలంగాణ ఎంపీలతో దెబ్బలాటకు కూడా దిగిన వీడియో క్లిప్పింగ్స్ వైరల్ అయ్యాయి. విద్యార్థి నేతగా కొట్లాటల్లో అనుభమున్న రాజగోపాల్ ఆ సమయంలో బాగానే తెగువ చూపారు. లోక్ సభలో పెప్పర్ స్ప్రై వాడి గందరగోళం చేశారు. తర్వాత విచారం వ్యక్తం చేశారనుకోండి అది వేరే విషయం.
ఎంతో ఒపికగా ఉండే లగడపాటి రిలేషన్స్ కు ఎక్కువ విలువ ఇస్తారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. వైఎస్సార్ మరణ వార్త విని కన్నీరు పెట్టారు రాజగోపాల్. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఓ మీటింగ్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Also Read : పోచారం వారసత్వం కోసం కుమారుల మధ్య పోరు
సర్వేలు… వివాదాలు..
2019 అసెంబ్లీ ఎన్నికలు ముందు వరకు ఓటరు నాడిని పట్టి గెలుపోటముల జోస్యంచెప్పేవారు. చాలా వరకు నిజమయ్యేవి. ఆయన చేపట్టే సర్వేల ఆధారంగా బెట్టింగులు కూడా జరిగేవి. 2019లో ఏపీలో టీడీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పి అభాసుపాలయ్యారు. అంతకు ముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. అప్పటి నుంచి లగడపాటి సర్వేల జోలికిపోవడం లేదు.
రాజకీయంగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని ప్రభుత్వాల నుంచి ఆర్థికంగా లబ్ధిపొందుతారనే ఆరోపణలు కూడా రాజగోపాల్ పై ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తీవ్రమైన ఆరోపణలే చేశారు. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. అప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే లగడపాటి ఎదుర్కున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా.. ?
చాలా పార్టీలు 2019 ఎన్నికల సమయంలో ఆయనను ఆహ్వానించాయనే వార్తలు మీడియాలో షికార్లు చేశాయి. కానీ ఏ పార్టీలోనూ జాయిన్ కాలేదు. అయితే ఓ సమయంలో మెదక్ నుంచి పోటీ చేస్తానని అన్నారు. కానీ అది అంత సీరియస్ చెప్పిన మాట కాదని తర్వాత క్లారిటీ ఇచ్చారు. అయితే రాజకీయాలను ఇష్టపడే రాజగోపాల్.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ ఫైట్ కు దిగుతారనే వాదనే ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఏ పార్టీ నుంచి ఉంటుందనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read : తమ్మినేని వీరభద్రం ఏం చేస్తున్నారు..?