iDreamPost
android-app
ios-app

Huzurabad Gellu Srinivas-గెల్లుకు బంపర్ ఆఫర్.. ఏకంగా మంత్రయ్యే ఛాన్స్?

Huzurabad Gellu Srinivas-గెల్లుకు బంపర్ ఆఫర్.. ఏకంగా మంత్రయ్యే ఛాన్స్?

భూ కబ్జా ఆరోపణలు రావడంతో మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ ను మంత్రి పదవి నుంచి తప్పించడంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల ఆ తర్వాత బీజేపీలో చేరారు. రక్షణ కోసమే అనేది బహిరంగ రహస్యం. ఆ సంగతి పక్కన పెడితే ఆయనకు పోటీగా వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌ గ్రామానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ను అధికార టీఆరెస్ రంగంలోకి దించింది. బీసీ నాయకుడు, విద్యార్థినేత, తెలంగాణ ఉద్యమకారుడిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు గుర్తింపు ఉందని టీఆర్‌ఎస్‌ ముందు నుంచి ఊదరకొట్టింది కానీ ఈటెల రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చే దాకా ఆయన ఎవరో జనానికి తెలియదు.

ఈటల రాజేందర్‌ బీసీ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్తుండటంతో కేసీఆర్‌ సైతం బీసీ నాయకుడినే బరిలో నిలిపి చెక్‌ పెట్టాలని ఆయనని రంగంలోకి దించింది కానీ అవేమీ వర్కౌట్ కాలేదు. మంచి వ‌క్త కాక‌పోయినా.. ఉద్య‌మ నేప‌థ్యం క‌లిసొస్తుంద‌ని అనుకున్నారు, కానీ ఆయన సొంత ఊరు సహా భార్య సొంత ఊరిలో సహా ఈటెలకు మెజారిటీ వచ్చింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈటెల గెలుపు బీజేపీ గెలుపు కాదని మొదట చెప్పుకున్న టీఆర్ఎస్ ఆ తర్వాత బీజేపీ-కాంగ్రెస్ లు కలిసి గెలిచాయని కవర్ డ్రైవ్ లు చేస్తున్నా గెల్లు శ్రీనివాస్ విషయమే అటూ ఇటూ కాకుండా పోయింది. దళిత బంధు పేరిట వందల కోట్ల డబ్బు కుమ్మరించినా ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. ఇక గెల్లు శ్రీనివాస్ ను జనం మరిచిపోతారా? అని కూడా అనుకునే పరిస్థితి. ఇప్పుడు ఎలాగో రంగంలోకి దించారు కాబట్టి 2023 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఖరారు అయినట్టే. కానీ ఇప్పుడు కొత్త వాదన తెరమీదకు వచ్చింది.

రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అన్నట్టు ఏమో, పెద్ద సారు దయతలిస్తే… గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్సీ కావడం పక్కా అని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈటెలను దెబ్బకొట్టి వచ్చే ఎన్నికల్లో అయినా ఆ సీటు గెలిచేలా ఆయనను మంత్రిగా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎమ్మెల్సీ చేసి తద్వారా మంత్రిని చేసి ఆయన చేత నియోజకవర్గానికి మంచి పనులు చేయిస్తే వచ్చే ఎన్నికల్లో అయినా గెల్లు గెలిచే అవకాశం ఉంటుందని గులాబీ దళాలు లెక్కలు వేసుకుంటున్నాయి అంటున్నారు. దానికి తోడు ఈటెల వైపే నిలిచిన ఉద్య‌మ కారులంతా, ఇప్పుడు గెల్లు కోసం గళం విప్పుతున్నారు. గెల్లు కోసం కొట్లాడ‌తామంటున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చేదాకా. ఎమ్మెల్యే కోటాలో గెల్లును ఎమ్మెల్సీ చేయాల్సిందేన‌ని పోరాడ‌తామ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇప్పటికే చాలా మంది ప్రకటించడమే కాక తమ పార్టీ పెద్దలని డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి. ఇది రాజకీయం కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. చూడాలి ఏం జరగగనుంది అనేది.