కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్న రైతు ఉద్యమానికి పలువురు మద్దతు తెలుపుతుండగా మరికొందరు నకిలీ రైతు ఉద్యమం అంటూ విమర్శలు చేస్తున్నారు.
చలి,ఎండ,ఆకలిని లెక్కచేయకుండా గత 19 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నిరసన కొనసుగుతూనే ఉంది. కాగా రైతు ఉద్యమానికి బాసటగా నిలుస్తున్న కొందరు రైతులకు ఆహార పదార్థాలతో పాటు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు, దుప్పట్లు అందిస్తున్నారు. కాగా గతవారం షాన్‌బీర్ సింగ్ అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి రైతుల ఆకలిని తీర్చేందుకు పిజ్జాలు పంచాడు. దాదాపు 400 పిజ్జాలను ఆకలితో ఉన్న రైతులకు అందించగా వాటిని ఆరగిస్తున్న రైతుల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పిజ్జాలు తింటున్న రైతులను ట్రోల్ చేస్తూ నకిలీ రైతు ఉద్యమం అంటూ పలువురు విమర్శలు చేసారు. రైతులు పిజ్జా తినకూడదా అంటూ మరికొందరు అసత్య ఆరోపణలు చేస్తున్న వారి వ్యాఖ్యలను ఖండించారు.
కాగా ఆకలితో ఉన్న రైతులకు పిజ్జాలను పంచిన షాన్‌బీర్ సింగ్ స్పందిస్తూ రైతులను విమర్శిస్తున్న వారిపై మండిపడ్డాడు. పిజ్జా తయారీకి కావల్సిన గోధుమలను పండించేది రైతులే అన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని తాను మరోసారి రైతులకు పిజ్జాలు,బర్గర్లు అందిస్తానని తేల్చి చెప్పాడు. ఇదే విషయంలో విమర్శకుల వ్యాఖ్యలపై స్పందించిన బాలీవుడ్ నటుడు, గాయకుడు దల్జీజ్ దొసాంజ్ రైతులకు తన మద్దతును తెలియజేయడమే కాకుండా విమర్శకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులు విషం తిని ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏ ఒక్కడూ అడగలేదు కానీ పిజ్జా తింటే మాత్రం కొందరు ఎందుకు విమర్శిస్తున్నారని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాడు. అసలు రైతులు పిజ్జాలు తినడం తప్పెలా అవుతుందని పలువురు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసేందుకు ప్రయత్నం చేసినా విఫలం కావడంతో రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. క్రమంగా మరింత ఉధృతంగా మారనున్న రైతు ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.